Monday, October 29, 2007

కొత్తపాళిగారి బ్లాగులో: భద్రుడి కథపై చర్చ

భద్రుడి కథ చర్చించడానికి ఆహ్వానం అన్నారు కొత్తపాళిగారు. నేను రాసిందే ఒక్క కథ. చదివింది మహా అంటే నూరు కథలు. ఇంతలోనే ఒక కథను గురించి నా అభిప్రాయాలు ఇవీ అని చెప్పగలిగే అధికారం ఇంకా రాలేదుగనుక, ఈ కథను చదువుతూ పోతున్నప్పుడు నాకు కలిగిన ఆలోచనలు క్రమంగా ... (ఇది వాడ్రేవుచినవీరభద్రుని కథ అని చూసి చదవలేదు, ఒకవేళ చూసివున్నా ఈ రచయిత గురించి నాకేమీ తెలీదు గనుక ముందుగా ఏర్పరచుకొన్న అభిప్రాయాలేవీ నాలో లేవు.)

1. కథ ప్రారంభంలోని ఈ మూడు మాటలు ...
౧. "ఈ నగరం ఎంత క్రియాశీలం! ఎంత కోలోహలం! కానీ దాని ఆరాటంలో నాకేదీ మనోవికాసం గోచరించదు."
౨. "వేసవి మధ్యాహ్నం వేళ మాగన్నుగా నిద్రిస్తున్నట్టుండే గ్రామం"
౩. "నీడ అంటే ఏమిటి? నిన్ను నువ్వు మరచిపోగల నిశ్చింత. నిన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేని ఒక క్షణం. పక్కమనిషిని చూసి బెదరవలసిన అవసరం లేని తావు."

నగరంలోకి చేరిన వెంటనే నేను కోల్పోయినట్లుగా గ్రహించింది "నీడ". మనుషులకీ మనుషులకీ మధ్య అవిరళమైన ఆకాశాన్ని, మాగన్నుగా నిద్రిస్తున్నట్లుండే గ్రామాన్నీ చూసిన నాకు -- ఈ భావాన్ని నాస్టాల్జియా అని కొట్టివేయడానికి వీల్లేదనిపిస్తుంది. నేనేం కోల్పోయానో తెలిసినా గ్రామానికి వెళ్తే అక్కడ బ్రతకుతెరువు లేదు. కాబట్టి, బ్రతుకుదెరువు వున్నచోటనే గ్రామంలో అనుభవించిన ప్రశాంతతనూ, మనోవికాసాన్నీ మళ్లీ సంపాదించుకోవటం ఎలాగనే ఇంట్రోస్పెక్షన్‌కు అకాశాన్ని కల్పిస్తుంది నాస్టాల్జియా.

2. "పెరిగి పెద్దవాణ్ణవుతున్నకొద్దీ రాముడికి దూరంగా జరుగుతున్నానేమో" అనే మాట చెప్పడానికి నేపథ్యం కోసమేనా తోలుబొమ్మలాట సంఘటన? దీనికి రెండు పేరాలు అనవసరమేమో అనిపించింది. కానీ ఈ ప్రస్తావన కథలో మళ్లీ వస్తుంది. నగరంలో "పిల్లల ప్రపంచంలో సజీవంగా వున్న రాముడు పెద్దవాళ్ల ప్రపంచంలోంచి ఎప్పుడో నిశ్శబ్దంగా తప్పుకున్నాడనే" స్పురణ ... నాకూ నిజమే అనిపించింది.

3. "రామాయణ కథని నాటకంగా మలచడానికి ఉవ్విళ్లూరని సంస్తృత నాటక కర్త ఎవరున్నారు? కానీ పిల్లలకోసం ... రాయడానికి నా శక్తి సరిపోదనిపించిది." ఈ మాటతో ఈ కథను మనకు చెబుతున్న పాత్ర ఒక సంస్తృత నాటక కర్త అని అర్థం చేసుకున్నాను. కనుక అతని భావాలమీద ఉన్నతమైన అభిప్రాయం కలిగింది. ఇక్కడ ఈ కథ మీద నాకు ఆసక్తి పెరిగింది.

4. "వాడికి చెప్పానన్నమాటేగాని, రామకథ నిజంగా నన్ను ఆకట్టుకుందా? నా అంతరాంతరాల్లో రాముడు నన్ను నిజంగా సమ్మోహపరిచాడా? నాకెప్పుడైనా ఆయనొక మానవీయ ఆదర్శమనిగానీ, దేవుడనిగానీ, అనిపించాడా?" ఇదీ మరియు దీని తరువాతి పేరా చదివాక, రామకథను విని మాత్రమే వున్న పిల్లాడిగా నా బ్లాగులో ఒక చిన్న దుమారం రేపాను. "రాముడొక బరువైపోయాడు. బహుశా నాదేశానికి కూడా. ఒక్క రాముడు కాదు. ఎందరో రాముళ్లు. ..." ఈ మాటల ప్రభావం ఆ టపాలోని నా వ్యాఖ్యల్లో కనబడుతుంది.

5. "తన స్వగ్రామంనుంచీ తల్లిదండ్రులనుంచీ దూరం 'కావలసివచ్చిన' ప్రతి మానవుడికీ రాముడు ఎంతో కొంత బోధపడుతుంటాడు." స్వగ్రామాన్ని వదిలి రెసిడెన్షియల్ స్కూళ్లూ కాలేజీల్లో చదివినది మొదలుకొని మన అనుభవాల్లోనుంచి ఈ మాటకు ఎంతైనా భాష్యం చెప్పవచ్చనిపిస్తుంది. ఇష్టం లేకపోయినా దశరథుడు విశ్వామిత్రునితో పంపించినట్లు నా తల్లిదండ్రులు నన్నూ హాస్టళ్లలో పడేశారు. విశ్వామిత్రుని ద్వారా ఎన్నో నేర్చుకొన్న రాముడిలాగే, ఇంటికి దురంగా స్కూళ్లలో కాలేజీల్లో మనకూ ఎన్నో అనుభవాలు. తండ్రి మాటను నిలుపుట కోసం రాముడు, బ్రతుకుదెరువుకై వేటలో మానవుడు ... 'రాముడు అయోధ్యలోనే వుండి వుంటే' అన్నది 'నేను మా వూళ్లోనే వుండివుంటే' అన్నదానికి కొంతైనా పోలికవుంది. అరణ్యవాసంలోనూ సుఖాలున్నట్లే వలసల్లోనూ అన్నీ సుఖాలే వుండవు కదా!

6. "రాముడులాంటి ఒక అన్నని, రాముడులాంటి ఒక్క కొడుకుని, రాముడులాంటి ఒక్క స్వామిని, రాముడులాంటి ఒక్క నేతని నేనిప్పటికీ చూడలేకపోయాను. అందుకే బహుశా నాతో సహా ప్రతి ఒక్కరికీ రాముడంటే ఒక అపనమ్మకం." ఠక్కున నేను అంగీకరించిన మాట. కానీ 'రాముడులాంటి' అన్నప్పుడు ముందుగా రాముడెలాంటివాడో నాకు పూర్తిగా తెలియాలి కనుక వాల్మీకిరామాయణాన్ని నేను కనీసం ఒకసారైనా చదవాలి.

7. "... 'రాముడిలో గొప్పదనమేమిటంటే తనని అనుసరించిన ప్రతివాణ్ణీ రాముడిగా మార్చేస్తాడు' అన్నాడొక మహనీయుడు నాతో ... తెలిసి ఇష్టపడ్డాడో, తెలియక ఇష్టపడ్డాడో ఇప్పుడీ పిల్లవాడు కూడా ఒదులుకోవడం లోని ఆనందాన్ని రుచి చూడటం నేర్చుకున్నాడు. కానీ నేనే, ఇప్పటికీ కూడా రాముణ్ణి నిజంగా ఇష్టపడకపోయి ఉండాలి. నాకు ఒదులుకోవడంలోని దిగులే తెలుస్తోంది తప్ప, ఆనందం అనుభవంలోకి రావడం లేదు." నా ఉద్దేశంలో ఇది ఈ కథలోని అతిముఖ్యమైన భాగం. ఒదులుకోవడం అనేది ఒక బలహీనతగా కనబడనీయకుండా అందులోని ఆనందాన్ని అనుభవించడంకోసమే ఒదులుకునే గుణం కొందరికి జన్మతః వస్తుందని నేను గమనించాను. నిజంగా వాళ్ల జీవితం ఆనందమయమే. తక్కిన వాళ్లకు 'ఒదులుకోవడంలోని దిగులే తెలుస్తుంది తప్ప, ఆనందం అనుభవంలోకి రావడం' జరగదు.

8. "ద్వీపాల్లాగా ఉన్న మనుష్యసమూహాల మధ్య మనిషికీ మనిషికీ మధ్య సేతువు కట్టాడాయన. ఆ వంతెన నేలమీద కట్టింది కాదు. హృదయాలను కలుపుతూ కట్టినది. ... రాముడికి గోడల్లేవు." ఇది ఈ కథ నాకు పరిచయం చేసిన రాముని-గురించిన-కొత్త-కోణం. "ఏమో నాకు తెలీదు నాన్నా" అన్న ఆ పిల్లవాడిని 'సేతువు' కడుతున్న రామునికి సాయం చేసిన ఉడతపిల్లతో పోల్చడం -- 'ఏ మనోవికారమూ గోచరించని నగరజీవితంలోని నిశ్చలతలో' ఆశ చావని కథకుడు వెతుకుతున్న 'మనోవికాసం'. ఆనందాన్ని వెతికే ఆశావాదం.

అందుకే నాకనిపించింది ... ఈ కథ నిస్సందేహంగా చాలా మంచి కథ. మన పొరుగు మనుషులకు దూరమౌతూ ఒంటరితనంలో ఆనందాన్ని వెతుక్కునేవారికన్నా మనుషులకు దగ్గరవ్వడంలో తనను తాను వదులుకోవడానికి సిధ్ధపడేవాళ్లకే రాముడెక్కువ సన్నిహితుడౌతాడు. ఎవరికెలా వున్నా, నా మనస్తత్వానికి మాత్రం ఇది ఒక ఆలోచనామృతమే అనుకుంటున్నాను.

మళ్లీ చర్చలోకి ...

4 comments:

కొత్త పాళీ said...

బాగా చెప్పావు!

Nagaraju Pappu said...

బాగుంది రానారే - కధని ఆకళింపు చేసుకోడానికి నువ్వుపయోగించిన 'punctuator' పద్ధతి చాలా బాగుంది (కథలో గేరు మారినప్పుడల్లా, ఓసారి సీటు బెల్టుని సరిచూసుకొని, అక్కడ వరకు జరిగిందాన్ని అర్ధం చేసుకొని ముందుకు కదిలడమని నా ఉద్ధేశ్యం). ఇలాటి లోతైన కథలు ఆకళింపు చేసుకోవాలంటే, ఇలాగే చదవాలనుకొంటా.

కథలో ఆత్మని కరక్టుగా పట్టుకొన్నావు.
--నాగరాజు (సాలభంజికలు)

నేనుసైతం said...

"అప్పుడప్పుడూ మీ టపాలను మాట్లాడించండి. మీ వ్యాఖ్యానంతో చెప్పండి. చదివే బదులు వింటాము. రానారె చేస్తా అన్నాడు ఇంతవరకు చడీచప్పుడు లేదు." -
జ్యోతక్క (వంశీ గారి టపా కి వ్యాఖ్య లో...).

జ్యోతక్క (వంశీ గారి టపా కి వ్యాఖ్య లో...)
రానారె,
జ్యోతక్క కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకు ఉంది (ఇంటి ఆడపడుచు ఉసురు మంచిది కాదు ;) )
-నేనుసైతం

రానారె said...

కొత్తపాళీ, నాగరాజుగార్లకు నెనరులు.

ఆ కథ గురించి మిగతా బ్లాగ్వరులు కూడా ఏమైనా అంటే బాగుంటుంది - కొత్తపాళీగారి బ్లాగులో.

@నేనుసైతం:
ఉసురు సంగతి మాత్రమే కాదండి, "మీరకుమీ గురువులాజ్ఞ" అనేది కూడా నేను జ్ఞాపకముంచుకోవలసిన మాట. ఒకసారి రికార్డు చేసి విని డిలీట్ చేసేశాను. మళ్లీ ప్రయత్నిస్తా.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.