అయ్యా ... అదన్నమాట విషయం!

ఏతావాతా తేలిందేమిటంటే , మనం వాల్మీకిరామాయణాన్ని పూర్తిగా చదవకుండా మాట్లాడటం --- నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును ఒక్కోడూ ఒకోచోట తాకి అదెలావుంటుందో చెప్పబూనినట్లుంటుంది అని. చర్చకు నేను మంగళం పాడేస్తున్నాను. "ఈ పరిషత్తు పాలిటిక్స్ నాదగ్గర కుదరదు, నాకింకా రెండు డైలాగులున్నాయి" అంటారా? :) మీ డైలాగులు చెప్పేముందు ఒక్క మాట ... [ఈ మాట నాది కాదు, ఎవరిదో మీరు సులభంగా కనిపెట్టగలరు :) ఈ మాటను చెప్పినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ]

" ... ఒక మహాకావ్యాన్ని, చందమామలో నీతికథల స్థాయిని మించి చూడలేకపోతున్న ఇప్పటి జెట్ యుగాన్ని చూస్తూంటే మాత్రం రవ్వంత బాధగానే ఉంది ..."

నేనన్నాను - "... నేటి జెట్‌యుగంలో నేనూ ఒకణ్ణే. కానీ రామాయణంలో తప్పకుండా ఏదో మహత్తు వుంది, అదేమిటి, అది నాకు ఎందుకు అందడంలేదు అన్నది కనుక్కుందామని కూడా నా ప్రయత్నం."

జవాబు: "... నాకు తోచిన సమాధానం: ఇక్కడ వ్యాఖ్యలు రాస్తున్న వాళ్ళలో ఎంతమంది రామాయణాన్ని (పూర్తిగా?) చదివారు? చాలా మందికి తెలిసింది – కొన్ని సినిమాలు, రామానంద్ సాగర్ జిల్లెట్ కంపెనీ షేవింగ్ సామాన్లకి వ్యాపార ప్రకటన్లా తీసిన ఒక చెత్త టి.వి.సీరియల్, కాకపోతె మరికొంత మంది – బహుసా ఉషశ్రీ చాలా సంగ్రహంగా చెప్పిన రామాయణ కథని చదివుంటారు. కాని, వాల్మీకి రాసిన రామాయణమంతా ఎంతమంది చదివుంటారు? మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా:

అయోధ్యకాండలో – రాముడికి కైకేయి వనవాసం సంగతి చెప్తుంది. ఆయన పితృవాక్య పరిపాలనకోసం వనవాసానికి నిశ్చయం చేసుకొంటాడు. ఆయన ఆ నిశ్చయం ఎందుకు చేసుకొన్నాడు? ఎలా చేసుకొన్నాడు? దీనిమీద వాల్మీకి మూడు సర్గలు చెప్పాడు. అదంతా చదువుతేనే కదా – ఆయన వ్యక్తిత్వం గురించి మనకి తెలిసేది?

వనవాసానికి పోవద్దని కౌసల్య ఎంతో వత్తిడి తెస్తుంది – తండ్రి మాట వినడం నీకెలా కర్తవ్యమో, అలాగే తల్లిమాట వినడం కూడా కర్తవ్యమే, నువ్వు పోవద్దు, ఇది నా ఆజ్ఞ అంటుంది. నువ్వెళ్ళిపోతే నేను బతకలేను, నా చావుకి కారణం నువ్వే అవుతావు అంటుంది. తండ్రి మాట విన్న రాముడు, మరి తల్లిమాటెందుకు వినలేదు? ఆవిడని ఎలా ఒప్పుంచగలిగాడు? ఇది మరో రెండు సర్గలు.

అక్కడనుంచి ఇంటికి వస్తాడు. అక్కడ సీతాదేవి ఎదురుచూస్తూంటుంది. ఆవిడని చూడగానే, రాముడికి దుఖం ముంచుకొస్తుంది, మెహం నల్లబడిపోతుంది. ఎవరితోనూ చెప్పుకోలేని బాధని ఒక్క భార్యతోనే పంచుకోగలడు మగాడు – అదీ దాంపత్యంలోని మజా. జరిగిన సంగతి ఆవిడతో చెప్తాడు. ఆవిడ కూడా వనవాసానికి వస్తానంటుంది – ఆ మాట ఎంత తియ్యగా చెప్తుందో, చదివి, అనుభవిస్తేనే కదా తెలిసేది? నువ్వు అడవిలో నడుస్తున్నప్పుడు, నీ ముందు నడుస్తూ ముళ్ళు ముచికలు పక్కకి నెట్టి నీ దారి సుగమం చేస్తానంటుంది ఆ సుకుమారి. సీతవంటి భార్య అని అందుకే అంటారు మరి.

ఆయన వద్దంటాడు. వనవాసం చెయ్యడం చాలా కష్టం, నీవల్ల కాదంటాడు. ఇక్కడ తను వెళ్ళిపోయిన తర్వాత దుఖః సాగరంలో మునిగిపోయే తన తల్లితండ్రులకి, స్నేహితులకీ, బంధువులకీ, సేవకులకీ అండగా ఉంటమంటాడు. ఆవిడ ససేమిరా కుదరదంటుంది. నీ పక్కనుంటే నాకేం కష్టం – వనవాసంలో అవస్తలేవో అవన్నీ నీవి, నువ్వుండగా నాకేం కష్టం అంటుంది. వీళ్ళిద్దరి సంవాదం మరో మూడు సర్గలు. అదంతా చదివితేనే కదా – అసలు వాళ్ళిద్దరిదీ అంత అన్యోన్య దాంపత్యమెందుకయ్యిందో తెలిసేది?

ఆవిడ ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోడు – అప్పుడావిడ అలుగుతుంది, ప్రణయకోపం చూపిస్తుంది (ఆవిడ ముందు సత్యభామ దిగదుడుపే..) అసలు నువ్వందగాడివేగాని, వీరుడివికావంటుంది, భార్యని అడివిలోనైనా, అయోధ్యలోనైనా రక్షించుకోగలగాలి, అంతేకాని రాజసౌధంలో మాత్రమే రక్షణ కల్పించేవాడు మగాడెలా అవుతాడంటుంది? కాని ఇలా అన్నప్పుడు ఎంతో స్నేహంగా, మృదువుగా అంటుంది – కాని కటువుగా కాదు.

చివరకాయన ఒప్పుకొంటాడు – “సరే నీ ఖర్మ ఎలా ఉంటే అలా అనుభవించు” అని అనడు. నువ్వు నాతో ఉంటే, నాకంతకంటే ఏంకావాలి, వనవాసమంతా విహార యాత్రలా సుఖంగా జరిగిపోతుంది, నువ్వు పక్కనుంటే – అది అడవైనా అమరలోకమే నాకంటాడు.

సీత వంటింటి కుందేలు కాదు, ఆయన పురషాహంకారి కూడా కాదు. ఈ మూడు సర్గలు చదివితే ఆ సంగతి అందరికీ అర్ధం అవుతుంది. కాని, ఎంత మంది చదివారు? రామయణం మహాకావ్యమెందుకయ్యిందో చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మనమేం చూద్దామనుకొంటామో, అదే మనకి కనిపించడం – ఒక కావ్యానికుండవలసిన లక్షణం. అందుకే పూరాం నవతీయుతీః పురాణం అంటారు.

మరో ఉదాహరణ: కిష్కింధకాండలో – భరించలేని సీతా వియోగాన్ని రాముడెలా భరించాడో వాల్మీకి ఎంతో అందంగా చెప్పాడు. ప్రతి క్షణం రాముడావిడని తలచుకొంటూ ఉంటాడు, ఇప్పుడెక్కడుందో, ఇప్పుడు నా పక్కనుంటే ఎంత బాగుండును అని దుఃఖ పడుతూ ఉంటాడు. ఇంతేకాదు, ప్రకృతి వర్ణనలో వాల్మీకికి సాటైన కవి ఇంతవరకూ కానరాడు. ఇవన్నీ కూడా ఒక మహాకావ్యంలో భాగమే కదా?"

నేనన్నాను - (ఇది కాసింత ఆత్మవంచన, కాసింత అజ్ఞానం) : మహాకావ్యాన్ని మహాకావ్యంగానే చూడగలిగేలా ... తగిన ప్రాథమిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవ్వరైనా ముందుకు రాకపోతారా ...

జవాబు: ప్రాధమిక పరిజ్ఞానం కావాలంటే, అందుబాటులో ఉన్న రామాయణాన్ని చదవాలి కదా? ఇప్పటికే, ఆ పనిని శ్రీనివాస శిరోమణిగారు చేసారు. మళ్ళా ఎంతమంది చెయ్యాలి. ఒకసారి చదివితే, అప్పుడు చెయ్యవచ్చు చర్చలు, అంతేకాని – ఏదో వినికిడి మాత్రంగా ఏర్పరచుకొన్న అభిప్రాయలతో చర్చలెలా సాధ్యం?

౧. మన సంస్కృతిలో ఉన్న తప్పొప్పులన్నీ రామాయణంలో ఉన్నాయి – అందుకే అది మన సంస్కృతికద్దంపట్టే మహాకావ్యమయ్యింది – ఇన్ని వేల సంవత్సరాలతర్వాత కూడా, సజీవంగానే ఉంది, మన సంస్కృతున్నన్నాళ్ళు అది సజీవంగానే ఉంటుంది కూడా. ఆ కావ్యంలో అన్ని పాత్రలలోనూ ఏవో బలహీతలున్నాయి. రాముడో, సీతో, లక్ష్మణుడో, హనుమంతుడో మనకాదర్శంకావాలంటే, వాళ్ళు సూపర్-బీయింగ్స్ కానక్కరలేదు. సూపర్-మాన్ ఆదర్శం ఎలా అవుతాడు? కధానాయకుడిలో అన్ని సుగుణాలు కలబోసి, అన్ని బలహీనతలు విలన్లో రంగరిస్తే, అది చందమామలో నీతికథవుతుంది, కాని మహాకావ్యమెలా అవుతుంది?

నానీ పాల్కీవాలా అనుకొంటా – ఒకసారి ఏదో ఉపన్యాసంలో అన్నమాట: Man is a risen ape, not a fallen angel. ఇది మనకెంత వర్తిస్తుందో – మన చరిత్రకి, ఇతిహాసాలకీ, కావ్యాలకీ, నాటకాలకీ, కథలకీ, కవితలకీ,విజ్ఞాన శాస్త్రాలకీ కూడా అంతే వర్తిస్తుంది కదా?

౨. తెలుగులో వచన రూపంలో వచ్చిన రామాయణాల గురించిన కొంత సమాచారం:

తేటతెలుగులో, శిష్ట వ్యావహారిక భాషలో వచ్చిన వాల్మీకి రామాయణాలు చాలానే ఉన్నాయి. ఉషశ్రీ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీనివాస శిరోమణిగార్లు చేసిన అనువాదాలు ఇందులో చెప్పుకోదగ్గవి. ఉషశ్రీ రామాయణానికి ఆయనే చదివిన ఆడియో కాసెట్లుకూడా ఉన్నాయి. ఉషశ్రీ రామాయణం చాలా సంగ్రహంగా ఉంటుంది. ఇందులో కధ సారాంశం మట్టుకు ఆయన క్లుప్తంగా చెప్పారు, కాని మెత్తం వాల్మీకి రామాయణాన్నంతా కూలంకుషంగా తెనిగించలెదు. శ్రీపాద వారి వాల్మీకి రామాయణం కూడా అంతే - ఇది ఉషశ్రీ రామాయణం కంటే చాలా విపులంగా ఉంటుంది, కాని మొత్తం రామాయణ కావ్యమంతా అంతా ఇందులో లేదు. అయితే, శ్రీపాద వారు ఉత్తరకాండని కూడా ఇందులో భాగంగా తెనిగించారు. శ్రీనివాస శిరోమణి ఉత్తరకాండని తెనిగించలేదు.

శ్రీనివాస శిరోమణి మాత్రం మొత్తం వాల్మీకి రామాయణాన్నంతా - ఒక్క శ్లోకం కూడా వదిలిపెట్టకుండా, తేటతెలుగులో, వచన కథగా రాసేరు. మొత్తం ఎనిమిధి సంపుటాలుగా వచ్చింది. ధర - రెండు డి.వి.డిల కంటే తక్కువే.

సాధారణంగా, చాలా మందికి రామాయణం మొత్తం కావ్యంగా తెలియదు. కథ - సంగ్రహంగా అందరికీ తెలిసిందే. కాని రామాయణానికి సంబంధించిన కొన్ని మౌలికమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు - వాటికి సమాధానాలు వెతకాలంటే, కథ మెత్తం, కావ్యంగా తెలుసుకోవాలి కదా? ఎక్కడెక్కడో వినికిడి ద్వారానో, జిల్లెట్ కంపెనీ వారి షేవింగ్ సామాన్లకోసం ఎడ్వరుటైజుమెంటులా తీసిన టి.వి.సీరియల్ ఆధారంగానో ఏర్పడిన అభిప్రాయాలాధారంగా ప్రశ్నలు, చర్చలు జరిగితే - వాటిల్లో ప్రామాణికతేంఉంటుంది?

వాల్మీకి రామాయణం కాకుండా, వేరే రామాయణాలు కూడా ఉన్నాయి - తులసీ దాస్ రామ చరిత మానస్ ఇందులో చెప్పుకోదగ్గది, తులసీ దాస్ రామాయణానికి కూడా తెలుగు అనువాదం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి ప్రచురించారు. ఇవి కాకుండా, రామాయణానికి విమర్శలు, వ్యాఖ్యానాలు కోకొల్లలు. మార్కిస్టు ధృక్పధంతో రంగనాయకమ్మ రాసిన 'విషవృక్షం' వీటిల్లో చెప్పుకోదగ్గది.

వీటిలో ఒక్కటైనా, ఒక్క సారైనా చదివినవాళ్ళు ఒక అరడజనుమందైనా చేరితే - ఇప్పుడు జరుగుతున్న రసవత్తరమైన చర్చలు, అర్ధవంతంగా కూడా జరిగే అవకాశముంది. లేనప్పుడు, కొన్ని వేల సంవత్సరాలుగా, మన సంస్కృతికి అద్దం పట్టిన ఒక మహాకావ్యాన్ని,
చందమామలో నీతికథల స్థాయికి మించి చూడడానికి అవకాశం లేదు.

రామాయణం చదివితే, మనం రాముడంత కాలేమేమో గాని, కొంత మృదుత్వం మాత్రం మన అంతరాత్మలో చొరబడుతుంది. అంతకంటే, ఏ కావ్యానికేనా పరమావధేముంటుంది?

....................................................

కాబట్టి మిత్రులారా, రామాయణాన్ని పూర్తిగా చదవాలి. వాల్మీకిరామాయణం చదవాలంటే మనం ఇప్పటికిప్పుడు సంస్కృతం నేర్చుకోనక్కరలేదు. శ్రీనివాసశిరోమణి చేసిన అనువాదం ఉంది. ఈ పుస్తకాన్ని దొరకబుచ్చుకొనే ప్రయత్నం చేద్దాం. దీని లభ్యత గురించి మీకు ఇదివరకే తెలిసుంటే దయచేసి తెలియజేయండి. తరువాత చర్చిద్దాం. రసవత్తరంగానూ అర్థవంతంగానూ కూడా ఉంటుంది. ఇంతటితో ఈ చర్చ సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ పై మా తరువాతి ప్రసారం ప్రారంభమౌతుంది. అంతవరకూ సెలవు. నమస్తే. జై హింద్!

కామెంట్‌లు

oremuna చెప్పారు…
జై హింద్
Sriram చెప్పారు…
గీతా ప్రెస్ ఘోరక్పూర్ వారిది వాల్మీకి రామాయణం ప్రతి శ్లోకానికీ తెలుగు అర్ధంతో సహా మూడు భాగాలుగా ఈ మధ్యనే విడుదలయ్యింది. పుస్తకం ఒక్కింటికీ నూటయాభై అనుకుంటా. అది చదువుకుంటే ఎవరి వచన రచనల మీదా ఆధారపడక్కల్లేదు. రామాయణం మీద మన అభిప్రాయం మనమే ఏర్పరుచుకోవచ్చు. గీతాప్రెస్ వారి దుకాణాలు ప్రతీ పెద్ద రైల్వే స్టేషన్ లోనూ ఉంటాయి.

నేను విన్న రామాయణ ప్రవచనాలలో మూల కధని యధాతధంగా అద్భుతంగా చెప్పింది ఇది:

http://surasa.net/music/purana/#chaganti_chaganti_ramayana_songs
Aruna చెప్పారు…
:).

5/10.
కొత్త పాళీ చెప్పారు…
బాగుంది. తెలుగులోనే కొంచెం ఇటీవలి కాలంలో వెలువడిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి అనువాదం కూడా హృద్యంగా ఉంటుంది. అక్కడక్కడా సందర్భోచితంగా వాల్మీకి శ్లోకాల్ని ఉదహరిస్తూ కథ చెబుతారు.
అబ్బే ఈ అచ్చతెలుగు మాకెలా ఎక్కుతుందీ అనుకునే ఆంగ్ల మానస పుత్రులకి ఆచార్య ఆర్షియా సత్తార్ ఆంగ్ల వచనంలో రాసిన అనువాదం ఉంది.
అజ్ఞాత చెప్పారు…
ఈ మాటలు చెప్పింది తెలుగు బ్లాగు పురో'హితుడు' తా.బా.సు. గారేనా?
Sriram చెప్పారు…
రాముడి గురించి లక్ష్మణుడికన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుందీ! చుక్కగారూ, ఈ మాటలు చెప్పింది ఆ శేషావతారమేనని నాకు గట్టిగా అనిపిస్తోంది. ఆయనకి వెయ్యినోళ్ళ పాండిత్యం మరి :)
rākeśvara చెప్పారు…
ఏ టపాకా వ్యాఖ్య రాయాలన్నారు పెద్దలు. కాబట్టి...
ఇక్కడ సర్చ రామాయణం చదవడం గురించి కాబట్టి...

కళ్ళముందున్నా చూడడానికి కళ్ళ కావాలన్నట్టు. చదివినా, అది మనలోకి ఊరడానికి, శ్రీరామ కటాక్షం వుండాలిగా.
ఇంకో విధంగా చెప్పాలంటే,
రామానుగ్రహం వున్నవారికి రామయణం అంటే ఏంటో తెలియకుండానే శ్రీరామం ఎక్కువ అబ్బుతుంది. అలా అనుగ్రహం లేని వాడు, రామాయణాన్ని కంఠస్తం పట్టినా , అజ్ఞానే అవుతాడు.

ఏదేఁవైనా చదవాల్సిన పుస్తకాల జాబితా లోకి వాల్మీకి రామాయణాన్ని నేడే చేరుస్తా! :)
కొత్త పాళీ చెప్పారు…
శ్రీరామా నీ చమత్కారం బహు బాగుందిగానీ ఈ రామాయణ గురువు పీయెన్నార్ అనబడే ఇంకొక ఫణీంద్రులని నాకు బలంగా అనిపిస్తోంది.
రానారె చెప్పారు…
@అరుణ,ఒరెమూనా - ఈ బ్లాగులో మొదటిసారి (కా)మెట్టినారు. సుస్వాగతం.

రాకేశ్వరా, ఆ పుస్తకం (శ్రీనివాసశిరోమణి రామాయణానువాదం) ఎక్కడైనా దొరుకబుచ్చుకోగలిగితే దయచేసి నాకూ చెప్పు.

చ.చు, శ్రీరామ్ - మా ఇంటికొచ్చి నాకే అర్థంకాకుండా ఏదో కోడ్ భాష మాట్లాడుకుంటున్నారా? ఆఁయ్...

చమత్కారం అర్థం కాలేదుగానీ, కొత్తపాళీగారిమాట నాక్కూడా బలంగా అనిపిస్తోంది. ఆ ఇంకొక ఫణీంద్రులే ఇక్కడి గురువు.
Nagaraju Pappu చెప్పారు…
మాస్టారూ: అప్పుతచ్చులు చూసి గుర్తు పట్టేసారా? పోస్టు చేసే ముందు దిద్దమని చెప్పా రానారేకి - మరచినట్టున్నాడు.
శ్రీరాం:నీ అభిమానానికి నెనర్లు. ఎన్ని నోర్లుంటే ఏం ప్రయోజనం -- ఈ శేషాతావరానిది మాత్రం అంతా బుస్సు-బుస్సే :-)
చ.చు: బా.సు గారు కేవలం ఒక్క పురానికి మాత్రం హితుడు కాదు, సర్వ మానవాళికి హితుడే ఆయన. వాక్సుద్ది ఉన్నవారు తప్పులెలా రాస్తారు?
Sriram చెప్పారు…
గురువుగారూ, నేనూ ఆ పీయెన్నార్ గారి గురించే చెప్తున్నాను. అందుకే వెయ్యినోళ్ళ పాండీత్యమనీ, శేషావతారమనీ అనేసాను. తాబాసు గారిని అలా అనే అంత చనువు లేదు.
oremuna చెప్పారు…
రానారె, అవునా! మీ బ్లాగు మొదటి నుండి చదువుతున్నానే (పైపైనే, సరే సరే!) మనలో మన మాట మీ సీమ యాస నే ఫాలో అవ్వలేను దానితో కామెంట్లు ఎక్కువగా రాలలేదేమో!
Sriram చెప్పారు…
రానారె, లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ అని చెబుతారు. వైకుంఠంలో ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే స్వామిని ఎలా వదలగలడూ! రామునితోటే ఉన్నాడు ఎప్పుడూ. అందుకే త్యాగరాజ స్వామి "చిత్రరత్నమయ శేషతల్పమందు సీతాపతిని ఊచే సౌమిత్రి భాగ్యమే భాగ్యమూ..." అని పొంగిపోయారు.

ఆదిశేషుడు మహా పండితుడు. అందుకే ఏదైనా అందమైన వస్తువు గురించి చెప్పాలంటే "దీనిని వర్ణించడానికి ఆదిశేషుడు కూడా సరిపోడు" అని అంటూ ఉంటారు. ఆయన పాండిత్యం, భాషా జ్ఞానం అలాంటివి. బహుశః వెయ్యినోళ్ళతోనూ చదువుకుని ఉంటాడు.
శేషావతారమైన లక్ష్మణుడుకి కూడా అంత పాండిత్యమూ ఉంది. కాని ఎంత పండితుడో అంత మితభాషి.

ఇప్పుడర్ధమైందా నేనన్నది? :)
రానారె చెప్పారు…
ఇంత వివరంగా చెప్పాక కూడా అర్థం కాకపోవడానికి నేనేమైనా నరేంద్రమోడీనా? ;-) కొత్త విషయాలు తెలిశాయి. ఆదిశేషుడు మహాపండితుడు అన్నది నాకు ఇప్పటిదాకా తెలీదు. ధన్యవాదాలు.
అజ్ఞాత చెప్పారు…
రానారె,
చాలా బాగుంది ఈ టపా.

నా అయోమయాన్ని క్షమించాలి. ఈ వివరణలు ఇచ్చినది మీరేనా, లేక నాగరాజు గారా?
ఇచ్చిన వారెవరైనా వారికి ధన్యవాదాలు.

నా టపాలో నేను శ్రీ రాముడి వియోగ వర్ణన సుందరకాండ లో విన్నాననుకున్నాను. అది కిష్కింధ కాండలో అన్న మాట. అది విన్నప్పుడు నాకు ఐదారేళ్ళకన్నా ఎక్కువ ఉండవు.
రానారె చెప్పారు…
నాగరాజుగారేనండి. నాకింకా అంత సత్తా రాలేదు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము