సిసలైన సివిలింజనీరు శ్రీరామచంద్రమూర్తి

రామాయణం అంతగా నచ్చేది కాదు నాకు. రామునికి చాదస్తమెక్కువ అనిపించేది. కారణం ఏమిటంటే, నాకు తెలిసినంతవరకూ రాముడెప్పుడూ పెద్దలేం చెప్పినా కిమ్మనలేదు. చేసుకుంటూపోయాడు. ఏ విషయంలోనూ ఎందుకు - అనే ప్రశ్నతో చర్చకు దిగినట్లు కనిపించదు. పెద్దలేంచెప్పినా అది సరైనదే అయివుంటుందనే నమ్మకం అయుండొచ్చుగాక. మరీ అంతగా నమ్మేయడమే ఇంప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. అలాగే లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీత వీళ్లంతా. ఏ విషయంలోనైనా నువ్విలా చేయమనడంలో అర్థమేమిటి అని అడిగిన సందర్భాలున్నట్లు నాకు తెలియకపోవడంతో రామాయణం నా దృష్టిలో బోరుకొట్టే స్టోరీ.

అదే మహాభారతంలో బోలెడు డిస్కషన్లు. సవాలక్ష చర్చలు, వాదాలు, తర్కాలు, క్లాజులు, ట్విస్టులు. బహుత్ రసవత్తర్ స్టోరీ. ఇందులో కూడా రాముని లాంటి కారెక్టర్ ధర్మరాజున్నాడు. భారత కథలో ధర్మరాజు కూడా అంత ఆకర్షణీయమైన మనిషిగా నాకు కనిపించడు. ట్వెంటీ-20 లాంటి మహాభారతంలో పాతకాలపు టెస్టుప్లేయర్లాగా అనిపిస్తాడు ధర్మరాజు. స్లోమూవింగ్, రిలాక్స్‌డ్ అండ్ అనట్రాక్టివ్ యట్ కూల్ ఫెలో. రాముడూ దాదాపుగా ఇంతే కానీ రాముడు చాలా పవర్‌ఫుల్. రామాయణమే ఒక టెస్టుమ్యాచ్ కాబట్టి సరిగ్గా ఇమిడిపోయినట్లే. వీళ్లిద్దరిలో నాకు నచ్చిన ఒక కామన్ పాజిటివ్ పాయింటేమిటంటే - ఇద్దరూ కూల్ 'కష్ట'మర్స్.

అంతకు మించి వీళ్లంటే నాకు ఆరాధనేమీలేదు. నిన్న ఒక కథ చదివినాక నేనెంత ఇరుకుమెదడుతో ఆలోచించానో కొంతవరకూ తెలిసింది. నా అంత కాకపోయినా ఎంతో కొంత ఇరుకుమెదడు మీకు గనక ఉంటుందేమోనని సందేహం వస్తే మీరూ చదవండి.

కామెంట్‌లు

సాక్షాత్తూ రాముల వారి పేరు నామధేయంలో ఉంచుకుని రామాయణం నచ్చకపోవటం ఒక రకంగా బాలేదు రానారె... just kidding ఇచ్చిన లంకె ఇంకా చదవలేదు కానీ, మొదటి రెండు లైనులు చూసి తొందరపడి రాసిన రాత ఇది... :)
రానారె చెప్పారు…
వంశీగారు, తమాషాగా అన్నా 'ఒక రకంగా నిజమే' :) రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకొనడం చాలాముఖ్యం అనేది ఆ కథ చదివాక నాకు కలిగిన ఆలోచనల్లో ఒకటి. మీరూ చదవండి. ఆ కథకు మరోపేరు పెట్టమంటే ఈ టపాకున్న శీర్షికనుపయోగిస్తాను.
అజ్ఞాత చెప్పారు…
రానారె,

బహుశా నేను కూడా అదే ఇరుకుమెదడు తో అలోచిస్తున్ననేమో.నాకు కూడా రాముని కంటే కృష్ణుడే నాకు నచ్చుతాడు.రాముడిని,కృష్ణుడిని తలచుకోగానే నాకు చిన్నప్పుడు ఎక్కడో చదివిన ఈ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది.
రాముడి భార్య కాబట్టి చాకలి వాడు కూడా కామెంట్ చేయగలిగాడు,అదే కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలున్నా ఎవరైనా అనగలిగారా అని... :)
రాధిక చెప్పారు…
అదేమిటో నన్ను కూడా రాముడు పెద్దగా ఆకర్షించలేదు.కృష్ణుడంటే పెద్దగా భక్తి లేదుగానీ చాలా అభిమానం మాత్రం వుంది.ఎందుకో నాకు తెలీదు.రాముడిలో అసలయిన మగాడు కనిపిస్తూవుంటాడు.అవమానించడం,అనుమానించడం,కొద్దిగా పురుషాహంకారం....ఇలా అన్నమాట.ఆడవాళ్ళకి నచ్చేగుణాలు కృష్ణుడిలో బాగా ఎక్కువ గా వుంటాయి.భార్యని ప్రేమ గా చూడడం,అలిగితే బుజ్జగించడం,అహం చూపకపోవడం.....
రాముడిలాంటి భర్త రావాలని నాకు తెలిసి ఇప్పటి అమ్మాయిలేవరూ కోరుకోవట్లేదు.మీరు లంకె ఇచ్చిన కధ చదువుతూ వున్నంతసేపూ ఏవో ఆలోచనలు వచ్చాయి కానీ నా అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి.
రానారె చెప్పారు…
ఈ టపాలో నేను కృష్ణుడి ప్రస్తావన తేకపోయినా ఆయన సీన్లోకొచ్చేశాడు. వచ్చాక రామునితో పోలిక కూడా వచ్చింది. నామటుకు నేను దైవం అనే విషయాన్ని పట్టించుకోను. సింపుల్‌గా చెప్పాలంటే నా దృష్టిలో దైవం - 'సత్యమే శివం' సినిమాలో చూపించిన దైవమే. ఇక్కడి చర్చకు సంబంధించినంతవరకూ రాముడు అంటే రామాయణం కథలోని ఒక పాత్రగా మాత్రమే పరిగణించాలని మనవి. వాల్మీకి సృష్టించిన ఆ పాత్రయొక్క తీరును అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. అందులో ఒక కోణం నేను చదివిన ఆ కథలోనిది (చూ. లంకె). సంఘజీవులమనుకుంటూనే ఏకాకులై బతుకుతున్న మనుషుల మనసుల మధ్య సేతువు నిర్మించే నిస్వార్థపరుడైన మనిషిగా రాముడిని ఆ కథలో చూపిస్తారు రచయిత.

నేనుసైతంగారు, మీరు చెప్పిన పాయింట్ బాగుంది. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనివున్నా కృష్ణుడిచ్చే ట్రీట్‌మెంట్ డిఫరెంట్‌గా వుండేదేమో. రాముడిలాగా సీరియస్ అయిపోయేవాడు కాదు.

రాధికగారు, మీ అభిప్రాయంలోని నిజాయితీకి అభినందనలు. నాక్కూడా కృష్ణుడంటేనే ఇష్టం. భక్తిలేదన్నా, అభిమానించడం కూడా సంప్రదాయ భక్తిమార్గాలలో ఒకటి అంటారు. రాముడు ఆదర్శప్రాయుడుగా ఉందామనుకున్నాడు. అందుకే అనుమానించడం, అవమానించడం అలాంటివన్నీ చేశాడేమో. కృష్ణుని మార్గం 'నొప్పింపక తానొవ్వక'...
భార్యను ప్రేమగాచూడటం - విషయానికొస్తే చూశాడనే అనిపిస్తుంది. కాకపోతే అది తన ధర్మంగా భావించి నిర్వహించాడు తప్పితే సాధారణంగా స్త్రీలు కోరుకునే Special attention ఇచ్చినట్లు కనబడదు. తిరకాసేమిటంటే కృష్ణుడి భార్యలు అలిగేవారు. కోపగించుకొనేవారు. సీతెప్పుడైనా అలిగివుంటే కదా రాముడేం చేసేవాడో తెలిసేది. ఆమెకు కోపం రాదు. వస్తేగిస్తే ఏడుపొచ్చేదేమో. ఆమెకూడా ఆదర్శ మహిళ కావాలనుకుందేమో! అలిగే ఛాన్సు ఎక్కడిచ్చాడయ్యా ఆమెకు అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. :) ఇది ఒక ఆసక్తికరమైన విషయం. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'మీరు మంచి అమ్మాయి కాదు' అనే పుస్తకం గుర్తుకొస్తోందిక్కడ.

ఐతే, ప్రస్తావనలోని ఆ కథకు సంబంధించినంత వరకూ 'ఆడవాళ్లకు నచ్చేగుణాలు' అనే కోణంలోంచి చూడకండి.
అజ్ఞాత చెప్పారు…
శ్రీరాముడు కల్పన కాడు. శ్రీరాములవారి మీద కామెంట్ చెయ్యకూడదు. అది మహాపాపం. అమ్మవారి ఆగ్రహానికి గురౌతారు.

శ్రీరాములవారి గుణాల్లో ఒక్కటన్నా సరే కనీసం అనుకరించలేము.

రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటివాళ్ళ దగ్గర ఉన్న tools సరిపోవు. ముందు రామాయణాన్ని అనేకసార్లు శ్రద్ధగా పారాయణ చెయ్యాలి.

రామాయణం ఒక ఉత్తమకాలానికి చెందినది. భారతకాలానికి సమాజం కొంచెం భ్రష్టుపట్టింది. అది మన కాలపు భ్రష్టత్వంతో కొంచెం సాటి వస్తుంది కనుక మనకు భారతం బాగా అర్థమౌతుంది.
రానారె చెప్పారు…
తాడేపల్లిగారూ, మీ వ్యాఖ్యలో చివరి వాక్యం గురించే సరిగ్గా ఇప్పుడే ఇప్పుడే ఆలోచిస్తున్నాను. 'ఆంధ్రహాభారతం' అనే గూగుల్ గుంపులో మనవాళ్లు ఆంధ్రభారతాన్ని యూనీకోడీకరిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆదిపర్వం పూర్తైంది. దాన్ని ఫార్మాట్ చేసి మెల్లమెల్లగా వికీసోర్సులో చేరుస్తున్నాను. అప్పుడు చూశాను వినత, కద్రువల పందెం. భారతాన్ని రాబోయేతరాలకు (నా వరకూ నా పిల్లలకు) కథగా చెప్పి ఆసక్తి కలిగించాలి అనుకుంటే వినత, కద్రువల పందెం బొత్తిగా పొద్దుబోని యవ్వారం కదా అని పిల్లలడుగుతారేమో అనిపించింది. అందులో భాగంగా కద్రువకు వినత దాస్యం చేయడమే కాక, ఆమె కుమారుడు గరుత్మంతుడు కూడా చేయవలసి వస్తుంది. చెయ్యకపోతే వాళ్లేం చేయగలరు? అంటే మహాబలవంతుడైన గరుత్మంతుని కద్రువ పుత్రులు ఏమీ చేయలేరు. మోసానికి గురియైనా "ధర్మబద్ధుడై" దుర్భరజీవితాన్ని గడిపిన గరుత్మంతుని పాత్రను మీరూ నేనూ అర్థంచేసుకున్నా రాబోయేకాలంలో పిల్లలకు ఇల్లాజికల్ అనిపిస్తుందేమో! అప్పుడు భారతాన్ని కూడా మీరు చెప్పినట్లు అనేకసార్లు శ్రద్ధగా పారాయణం చెయ్యాల్సిందేనేమో! ఆ రకంగా చేయనివారికి రామాయణ భారతాలు రెండూ క్రమంగా నిరుపయోగమైన పురాణాలైపోవలసిందేనా? అనిపిస్తోంది.
అజ్ఞాత చెప్పారు…
"Going by the fact that current generation can not only watch, but enjoy and encourage the telugu movies these days, which have no reason, no logic, no values,
I am sure there will never be dearth of audiences for epics like ramayana and mahabharata.

I am not meaning to dishonor the great epics. That was just some analogy to bring home the point.

Ranare, even our maths and science text books or the basic reading books need to be read and re-read several times to grasp what is indeed very practical and useful information.
Epics and sacred texts can be discussed, but not without proper education and awareness of the same. Whether attempting to demean or upphold, to understand is an essential prerequisite."

-- Lalitha.G
రానారె చెప్పారు…
లలితగారూ, మంచి మాట చెప్పారు. చెత్త సినిమాలను చూసినట్లుగా కాకుండా సీరియస్‌గా జీవితంలో పనికొచ్చే సంగతులేమైనా నేర్చుకొనే ఉద్దేశంతో భారతరామాయణాలను చూడాలంటే వాటిని మళ్లీమళ్లీ చదవాలి. తాడేపల్లిగారు కూడా ఈ మాటనే చెప్పారు. అనేకసార్లు శ్రద్ధగా పారాయణం చెయ్యాలని. కొన్ని దశాబ్దాల క్రితం ప్రతి పల్లెలోనూ ఇది జరిగేది. ఈ కాలంలో దీని ప్రాక్టికాలిటీ ఎంత? రాముడంటే ఇష్టం కలిగి వుండాలంటే ఆయన గురించి సరిగా తెలియాలి. కానీ రాముడు అనగానే, భార్యను అనుమానించిన వ్యక్తిగానే ఎక్కువగా project చెయ్యబడుతున్నాడు. ఇంకా బీజేపీ ఆరెస్సెస్ వాళ్ల ఆయుధంగా, చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయాడు. బహిరంగంగా 'రామ' జపం చేస్తూ కనిపించే వాళ్లలో ఎక్కువమంది ఉద్రేకంగా కనిపిస్తున్నారు. హింసాత్మకంగా కనిపిస్తున్నారు. రామనామం జపించడం వెనుక ప్రశాంతతకు బదులు ఆవేశం చూస్తున్నాం. ఎక్కడైనా గొడవలైతే అక్కడ బలప్రదర్శనకోసం రామనామం జరుగుతోంది. సాధువు అనబడే ప్రతివాడి చుట్టూ అనుమానాలున్నాయి. స్వామీజీ అనేపదం 'మోసగాడు'కు పర్యాయపదం అయిపోయింది. ఇది నేను చూస్తున్న బాహ్యప్రపంచం. నేటి పిల్లలు చూస్తున్నదీ ఇదే. ప్రతి ఇంట్లో టీవీల్లోకూడా ఇదే. రామనామం చేస్తున్న వాళ్లలో దాదాపుగా మనం చూస్తున్నవాళ్లెవరూ ప్రశాంతంగా కనబడటంలేదు. రాముడు మంచివాడు, సాత్వికుడు, స్నేహగుణం కలిగినవాడుగా ఎక్కడ కనబడుతున్నాడు? ఆయనలా కనబడాలంటే రామాయణ పారాయణమే మార్గమనుకున్నా అందుకు ప్రేరేపించే పరిస్థితులేవీ!? ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలోని ఆ కథ నాకు చాలా కొత్తగా ఆహ్లాదకరంగా కనిపించింది. ఇలాంటి కథలు, వాటిగురించిన చర్చలతో రాముడంటే ఉన్మాదుల ఆయుధం కాదు అనే విషయం కొంతైనా ప్రచారంలోకి వస్తుందేమో! పారాయణానికి పురికొల్పుతుందేమో!

సీతమ్మను దేవతగాకన్నా హింసకు గురై మారుమాట్లాడలేక ఆదర్శాలపేరిట బలైన అమాయకురాలిగానే చిత్రీకరణ జరుగుతోంది. సీతమ్మ ప్రశించలేదు, పాపం అమాయకురాలు, నేటి మహిళ అలాకాదు కారాదు అంటారు నేటి స్త్రీవాదులు. కాదనడానికి ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదేమో! ఉంటే అది ఎక్కడా వినబడదే!? మరి అలాంటి సీత ఎవరికైనా ఆదర్శం ఎలా అవుతుంది? ఏమిటి ఆనిడనుంచి ఎవరైనా నేర్చుకోవలసింది? ఆదర్శాలపేరిట మారు మాటాడక మౌనంగా భరించడం పాతకాలపు లక్షణం, అలాంటి మోసాలు ఇక సాగవు - (నిజమే కదా అనిపిస్తుంది) - అంటున్నవారికి సమాధానం ఏదైనా ఉందా? రామాయణంలో ఖచ్చితంగా ఏదో మహత్తు వుందనే నేనూ గట్టిగా నమ్ముతున్నాను. కానీ ఏమిటది? ఈ కాలానికి రామాయణం ఏ విధంగా పనికొస్తుందో తెలిసినవారెవరైనా చెబితే వినాలనుంది.
Burri చెప్పారు…
రానారె గారు,

మన పురాణాలు చిన్నమాటలతో పెద్ద అర్ధాలు చెప్పును, కాకపోతే అది మనం చూసే విధానంలో ఉండును.

(రామాయణం) రాముడు పట్టపగలు, పట్టుఊయ్యలో సుఖముగా పుట్టినాడు. ఏనాడు సుఖముగా లేడు, ఒకే భార్య, మరియు నేను దేముడును అని ఎనాడు చెప్పలేదు. అమ్మనాన్న, అన్నతమ్ముడు, ప్రజలు-సమాజం(చాకలితో సుమా!) ఇవే నాలోకం-నాస్వర్గం అని అన్నాడు, వాళ్ళ కోసం నా సుఖ/ప్రాణాలు అడ్డు అని, పెట్టి చూపినాడు. మాటలు చేప్పే రకం కాదు, అచరించి చూపే రకం. మంచి ఎప్పుడూ చేదు అని నిరూపించినాడు. అయన ఒక మంచి రాజు, అయనది రామరాజ్యం, అయన రాజ్యం పది కాలాలు చల్లగా ఉండును. రామయణం లో ప్రజలకు ముందు వెనక ఎప్పుడూ సుఖాలే.

(భారతం) కృష్ణుడు మధ్యరాత్రి, చరసాల లో ఏనో కష్టనష్టాలలో పుట్టినాడు. తరువాత అంతా సుఖముగా ఉన్నాడు, పలువురు భార్యలు, మరియు నేను దేముడును అని చెప్పినాడు, పూజించమన్నాడు. అమ్మనాన్న, అన్నతమ్ముడు బంధాలు మిధ్య అని గీతోపాదేశం చేసినాడు, విజయమే స్వర్గం అన్నాడు, వాటి కోసం ప్రాణం ఇవ్వమని చెప్పినాడు. మాటలతో లోకాన్ని ఏలినాడు, అచరించి చూపే రకం కాదు. మాటలు ఎప్పుడూ తియ్యన అని నిరూపించినాడు. అయన ఒక మంచి మంత్రి, అయన రాజ్యం(యాదవ) ఒక మిధ్య, అది అయన కళ్ల ముందే నాశనం అగును (గాంధారి శాపం వలన యాదువశం లో ముసలం పుట్టును, అది పెద్ద కధ). మహభారతం లో ప్రజలకు ముందు వెనక ఎప్పుడూ కష్టాలే, అంత నాశనం.

అందుకై రాముడు అంటే మన తాతలకు ఇష్టం, కృష్ణుడు అంటే మన కాలం వాళ్ళకు ఇష్టం. నాకు రాముడు అంటే ఇష్టం.

ఇది నా అభిప్రాయం.

-మరమరాలు
అజ్ఞాత చెప్పారు…
రానారె గారూ,

తాడేపల్లి గారు చివరి వాక్యంతో రాముడు, కృష్ణుడి తేడా బాగా చెప్పారు. సాహితీపరంగా చూసినా, రామాయణం, రాముడు నచ్చినంతగా కవులు, రచయితలకి మిగతా పురాణాలు, గట్రా నచ్చలా. ఆయా అనువాదాలు, విమర్శలే అందుకు సాక్షం.
అజ్ఞాత చెప్పారు…
బాగా వ్యాఖ్యానించావు రానారె. అసలు టపా కన్నా వ్యాఖ్యలకు నీ సమాధానాలు బాగున్నాయి. నేను చెప్పేది కూడా అదే. రామాయణం మహాభారతాల్లో అవసరం లేనివి వదిలేస్తే..మనకు అవసరమైనవి...మన జీవితానికి ఉపయోగపడేవి చాలా చాలా కనిపిస్తాయి. విషయంలో ఉన్న మంచి కన్నా జనాలను చెడు ఎక్కువగా ఆకర్షిస్తుందనుకొంటా. నువ్వు చెప్పినట్లు...రామునికున్న ఎన్నెన్నో సుగుణాలు వదిలేసి...ఒక్క "అనుమానించాడు".."భార్య పట్ల అతని నిబద్దత ఎంత" అని పట్టుకొని వేలాడుతుంటారు. రాముడు సీత ఉత్తమ మానవులు. మనం ఆయా పాత్రల మంచిని గ్రహించి..ఆ సుగుణాలను మనలో కూడా నింపుకోవాలి. ఉదాహరణకు .."రాముడు తండ్రి మాటకు ఇచ్చిన విలువ" ఎటువంటిదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు...నేడు ప్రతి రోజూ సినిమా వెబ్‌సైట్లలో మారిమోగిపోతున్న చిరంజీవి చిన్న కూతురు వార్తలు తను తన తండ్రికి ఏపాటి విలువనిచ్చిందో తెలుపుతున్నాయి. దశరథునిచే శరాఘాతానికి గురయ్యి చచ్చిపోతూ కూడా తన గుడ్డి తల్లి తండ్రుల దాహం గురించి ఆలోచించిన మహోన్నత పుత్రుడు శ్రవణ కుమారుడెక్కడ...కేవతం తమ సుఖం కోసం తల్లితండ్రులను అవమానించే ఈనాటి కుర్రకుంకలెక్కడ. ఇటువంటి వారు శ్రవణకుమారుని పేరు తలవడానికైనా అర్హులగుదురా? అటువంటి వారు రామాయణం నుంచి నేర్చుకోవలసిన మరియు ధారణ చేయవలసిన గుణాలు ఎన్నో ఉంటాయి (అందరమూ అనుకోండి..ఇక్కడ ఉదహరించాను అంతే). మరి సీతమ్మ...నిజంగా ఆమె పాత్రకున్న పవిత్రత..సుగుణాలు వర్ణించడానికి నాకున్న భాషా ఙ్ఞానం సరిపోదు. నాకు తెలిసి సీత మరియు లక్ష్మణులు వనవాసం ఎప్పడూ 'కష్టం' అనుకోలేదనుకుంటా. రాముని సహచర్యం కన్నా గొప్ప సిరి సంపదలు, సంతోషాలు ఈ ప్రపంచంలో ఉంటాయా? లక్ష్మణుడికి ఈ నిజం తెలుసు కాబట్టే ఆనందంగా అన్నతో పాటూ అడవికి వచ్చేశాడు. సీత రాముని 'మౌనంగా భరించింది' అని చెప్పడం హాస్యాస్పదం. సీత మౌనంలో మీకు రాముని పట్ల అపరితమైన ప్రేమ కనపడటం లేదా? తనొక్కడై ఉన్నా ..భార్యను అపరించింది ముల్లోకాలనూ గడ గడ లాడించిన రాక్షసుల చక్రవర్తి మహాబలసంపన్నుడని తెలిసినా, అపరిమిమైన పరాక్రమంతో కోతుల సాయంతో అతని మీద దండెత్తి సంహరించడం వెనక రాముల వారికి సీత పట్ల ఉన్న ప్రేమ కనపడటం లేదా? "సీతమ్మ ప్రశించలేదు, పాపం అమాయకురాలు, నేటి మహిళ అలాకాదు కారాదు" అనే నేటి సోకాల్డ్ స్త్రీవాదులకి అసలైన ప్రేమంటే ఏమిటో తెలుసా అని? ఎదురు ప్రశ్నించడంతోనూ, గడుసుదనంతోనూ ప్రేమను పెంచుకొని పంచుకోగలమా? సిసలైన ప్రేమ కురిపించినప్పుడు కరగని మానవ హృదయం ఉంటుందా?
ఇన్ని ఉన్నా జనాలకు రామాయణంలో నేటి కాలనికి సరిపడిన విషయాలు నేర్చుకోవలసినవి ఏమీ కనపడ్డం లేదా!!!
(లేదు అని మాత్రం చెప్పకండే ;) )
రాధిక చెప్పారు…
నవీన్ గారూ ప్రశ్నిస్తే ప్రేమ లేనట్టేనా?ఇప్పుడు నేను లోకం కోసం బ్రతుకుతాను అంటూ నా భర్తని నిర్లక్ష్యం చేస్తే నన్ను మంచి స్త్రీ గా లోకం ఒప్పుకుంటుందా?
ప్రతీదీ యుగ ధర్మం అంటారు.బహుశా రామాయణ కాలం నాటి ధర్మాలు ఈ యుగానికి సరిపడవేమో? తండ్రి మాట విన్నాడు అంటున్నారు.నిజమే.అది చాలా గొప్ప లక్షణం.ఒక ఆదర్శ పురుషుడు అన్ని విషయాలలోనూ ఆదర్శం గా వుండాలిగా. ప్రత్యర్ధి బలవంతుడయినా భార్యని కాపాడుకొన్నాడు అంటున్నారు. రాజవుతున్న అతను భార్యను కూడా కాపాడుకోలేకపోతే రాజ్యాన్ని ఎలా రక్షించగలడు?బహుసా జనాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కూడా అలా సాహసించి వుండొచ్చు.సీతాదేవి భర్తపై చాలా ప్రేమ వుంది కాబట్టే అరణ్యవాసానికి కూడా ఇష్టం గా వచ్చింది.మరి అంత చేసిన సీత కోసం రాముడేమి చేసాడు?అంతచేసినా సీత ప్రేమవల్లే అన్నీ భరించింది.చివరికి ఆమె రాముడిని వేలెత్తి చూపకుండా తనదారి తను చూసుకుంది.అంటే ఇప్పుడు మగవాళ్ళు ఏమి చేసినా కూడా అలా మాట్లాడకుండా వుంటేనే పతివ్రతలు అవుతారా?సీత అలా వున్నందుకేగా పతివ్రత అంటున్నారు.అలా భర్తకు అనుగుణం గా వున్నందుకు కాక వేరే విషయం లో సీతను గొప్పగా ఎక్కడన్నా చూపారా?[నాకు తెలియదు.అలా చూపించిన సంఘటనలనలు వుంటే తెలియచేయగలరు].తాడేపల్లి గారన్నట్టు ఎదన్నా లోతుగా పరిశీలిస్తేనే,ఎక్కువ చదివితేనే చాలా విషయాలు అర్ధమవుతాయి.నా వయసుకి నేను ఇంకా చదవాలి.ఎదగాలి.నాకు తెలిసిన కధలతో మాత్రమే ఈ కామెంటు రాసాను.
మరమరాలుగారు చెప్పిన మాట నిజమేనేమో?ఏకీభవించాలనే వుంది.
తాడేపల్లిగారు అన్నట్టు రాముడు కల్పన కాదు.నాకూ నమ్మకం వుంది.కానీ ఆదర్శ పురుషుడనే మాటనే ఒప్పుకోవాలనిపించట్లేదు.
[తప్పులు మాట్లాడివుంటే క్షమించాలి]
రానారె చెప్పారు…
ఈ చర్చలో వస్తున్న ముఖ్య విషయం - "రాముడు ఆదర్శపురుషుడు ఎలా అవుతాడో అర్థం చేసుకోవడం ఎలా?" నవీన్ వ్యాఖ్యలో "చెడును వదిలేయండి" అని వుంది. అంటే రాముని వర్తనలో లోపాలు వున్నట్టేనా? "అన్నదమ్ములా ఆదర్శమైనా, ఆలూ మగలా అన్యోన్యమైనా, తండ్రిమాటనూ నిలుపుటకైనా ధరలో నీవే దశరథరామ్!" :)
Nagaraju Pappu చెప్పారు…
ఈ టపా, కొన్ని వ్యాఖ్యలూ "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు" అన్న అన్నమయ్య కీర్తనని గుర్తుకు తెస్తున్నాయ్.

ఆ కథలో చెప్పినట్టు, రాముడు మనలని మనకి పరిచయం చేస్తాడనుకొంటా :-)

--నాగరాజు (సాలభంజికలు)
అజ్ఞాత చెప్పారు…
రానారెగారూ - మంచి కధను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.ఇంకా ఏదో చెప్పాలని ఉంది. ఒక టపాగా వ్రాస్తాను.

కొత్తపాళీగారూ - కధపై అభిప్రాయాల్ని ఆహ్వానించి రామాయణాన్ని వివిధ సమకాలీన దృక్పధాలతో విశ్లేషణలకు కారణభూతులైనందుకు ధన్యవాదాలు.

రాధికగారూ - రాముడు సీతకు ఏమి చేసాడంటారేమిటండి. తప్పును తన నెత్తిమీద వేసుకున్నాడు. ఆనాడు రాముడు ఏమీ అనకపోతే తరువాత మన అచరిత్రకారులు నోటికొచ్చినదల్లా అనిఉండేవారు కదా. యుగయుగాలుగా ఆ నిందను తను భరిస్తూ సీతను అగ్నిపునీతను చేసిన రాముడి త్యాగాన్ని ఏమని పొగడాలి. భార్యాభర్తలు అనగానే సీతారాములు అంటాము గాని కృష్ణుడు - అతని పత్నులు అందులో కనపడరు కదండి.

మన సాలభంజికల నాగరాజుగారి హనుమంతుడి వ్యాసం అందరూ ఒకసారి చదవ ప్రార్ధన.
రానారె చెప్పారు…
నాగరాజుగారి హనుమద్రహస్యం లంకె .
మెహెర్ చెప్పారు…
'Ramayanam', above all, is a work of art. మనకు రాముడి గురించి తెలిసిందంతా వాల్మీకి మహాకావ్యం ద్వారానే. వాల్మీకి తన కథానాయకుడి పాత్రను తన ఊహాశక్తిని ఉపయోగించి సృజించాడో లేక ఎవరైనా చారిత్రక పురుషుడ్ని ఆధారం చేసుకున్నాడో మనకు తెలియదు; అది ఇరెలవెంట్ కూడా. భారతమూ ఇంతే. ఈ రెండింటినీ పోల్చి చూడటంలో అర్థంలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కళాకారుడిగా వాల్మీకి పంథా వేరు, వ్యాసుడి పంథా వేరు. Their way of seeing things, of course, bound to differ. ఇద్దరు వేర్వేరు రచయితలచే, వేర్వేరు కథావస్తువులతో సృజింపబడిన రెండు వేర్వేరు రచనలకి, ఆ రచనల్లో పాత్రలకి పోలిక సరిచూడడం అసంబద్దమౌతుంది.

అయినా ఒక మామూలు పాఠకునిగా రామాయణ మహాభారతాల్లో నా ప్రాధాన్యత చెప్పమంటే భారతానికే ఓటేస్తాను: వందలాది పాత్రలూ, ప్రతీ పాత్రకీ distinct characterizations, సర్వరసాలంకృతమైన విభిన్న సన్నివేశాలూ, కథలూ ఉపకథలూ - అయినా మొదటినుండీ చివరివరకూ ఎక్కడా పట్టుసడలకుండా... పద్దెమినిది పర్వాలు! It's a rare feat indeed. కంపేరిటివ్‌గా చూస్తే ఈ మాస్టరీ, నిపుణత వాల్మీకి రామాయణంలో కనిపించదు. (Original text చదవకుండా - కేవంలం మా తాతయ్య చెప్పిన కథలూ, బాలానంద బొమ్మల రామాయణ-భారతాలూ, రామానంద సాగర్ టి.వీ. సీరియళ్ళూ, రామారావు పాత సినిమాలూ చూసి ఈ కంక్లూషన్‌కి వచ్చేయడం ఘోరమైన తప్పిదమేమో... all the same.) భారతంలో అబ్బురపరిచే విషయం ఏమిటంటే ఇన్ని బహుళ, విలక్షణ పాత్రలను గుప్పెట పట్టి, వాటి ఔచిత్యం ఏ మాత్రం చెడకుండా మొదటినుండీ చివరిదాకా అదే consistency తో వాటి స్వభావ చిత్రణను నడిపించిన వ్యాసుడి నైపుణ్యం. అందుకే వ్యాసుడిని 'ఆఖ్యాన వరిష్ఠుడు' అంటారు. (అంటే కథలు చెప్పడం ఆరితేరినవాడు అని అర్థం.)

ఆ సంగతి వదిలేస్తే, రామ మార్గం అనుసరణీయమా కాదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. ఆ పాత్రను ఆవరించి ఉన్న స్థలకాల పరిస్థితులూ, సాంఘిక స్వరూపం, ఆ పాత్రకు ఎదురైన సమస్యలూ, వాటికి ఆ పాత్ర స్పందించిన విధానం, ఆ పాత్ర ప్రాధామ్యాలూ - వీటన్నింటినీ నేటి పరిస్థితులకు అన్వయించలేం. ఇక్కడ మనం 'రామ మార్గం' అని - అతన్ని కమ్ముకున్న సమస్యలకు అతను ప్రతిస్పందించిన విధానాన్ని కాక, ఆ సమస్యల పట్ల అతని దృక్పథాన్ని గురించి అంటున్నట్లయితే; అయినాకూడా 'రామ మార్గం' అనుసరణీయం అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే - కృష్ణుడు తన సమస్యలను ఏ తీరున ఎదుర్కొన్నా, ఆ మార్గం అనుసరణీయమైనా కాకపోయినా; ఒక సమస్య పట్ల అతని దృక్పథం: సమస్య ముంగిట నిలబడి అతను ప్రదర్శించే స్థితప్రజ్ఞత ఖచ్చితంగా అనుసరణీయమేననిపిస్తుంది. రాముడిలో ఈ స్థితప్రజ్ఞత కనిపించదు. (సీతను రావణుడెత్తుకెళిపోయాక అరణ్యమంతా బావురుమంటూ తిరిగిన రాముడు; సీతను అడవులకు పంపి తనలో తనే కుమిలిపోయిన రాముడు.) కానీ కృష్ణుడలాకాదు - ఒక అనుభవజ్ఞుడయిన చదరంగపు ఆటగాడు తన ముందున్న నలుపు-తెలుపు గళ్ళ పటాన్నీ; దాని పైని పావుల్నీ ఎలాంటి స్పష్ఠతతో, సాధికారతతో, డిటాచ్‌మెంట్‌తో పరికిస్తాడో - కృష్ణుడు తన జీవితపు ఆదిమధ్యాంతాల పట్ల అలాంటి స్పష్ఠమైన అధివీక్షణను (Over view) కలిగి ఉన్నట్లనిపిస్తాడు. రాముడిలో ఈ అధివీక్షణ కనిపించదు. జీవితమనే గజిబిజి గడుల ప్రవహ్లికలో (Labyrinth) దారి తప్పిపోయిన పసివాడికిమల్లే గోచరిస్తాడు.

అసలు రాముడు good boy syndrome తో బాధపడి ఉంటాడా అని నా అనుమానం. ఎందుకంటే - రాముడికీ ఐడియల్స్ ఉన్నాయి, కృష్ణుడికీ ఉన్నాయి; రాముడూ వాటిని తప్పాడు (వాలిని చాటునుంచి చంపడం, రావణుడి మరణ కీలకాన్ని అతని సోదరుడి దగ్గర్నుండే రహస్యంగా తెలుసుకోవడం etc.), అలాగే కృష్ణుడూ తప్పాడు (వివరించను - ఈ parenthesis సరిపోదు). కానీ రాముడు జీవితమంతా కష్టాలు అనుభవించాడు; కృష్ణుడికి జీవితమో జాయ్‌రైడ్. మరి, 'రాముడు ధర్మనిరతుడు, తన ఐడియల్స్‌ని వదులుకోలేకే అన్ని కష్టాలు పడ్డాడు' అనుకోవడానికి లేదే - తప్పదనిపించిన చోట ధర్మాన్ని తప్పుతూనే వచ్చాడు. కాబట్టి రాముడి ఋజువర్తనే అతనికి ఈ కష్టాలు తెచ్చిందని చెప్పలేం. రాముడి కష్టాలకు అసలు కారణం నేను పైన చెప్పిందే - రాముడి గుడ్‌బాయ్ సిండ్రోమ్; లోకం మెప్పునీ, అంగీకారాన్నీ పొందాలన్న కాంక్ష. ఆ కాంక్షే సీతని నిప్పుల్లోకి దూకించింది. ఆమెని నిండు గర్భిణియై ఉండగా అడవుల్లోకి నెట్టించింది. క్షత్రియ ధర్మమా వల్లకాడా... లోకం మెప్పుకోసం దగ్గరి వాళ్ళని కడగండ్ల పాల్జేయడం అదేం ధర్మం? కానీ కృష్ణుడు తన చర్యలకి లోకపు అంగీకారాన్ని ఎప్పుడూ ఆశించినట్లు కనపడడు. ఇమేజ్‌కోసం అతను ఎప్పుడూ ప్రాకులాడలేదు. తనక్కావలసిన వారికెప్పుడూ అండగానే నిలిచాడు. - లేకపోతే వందమంది కౌరవులపై యుద్దానికి బయల్దేరిన ఐదుగురు పాండవులకు ఎందుకు వత్తాసు పలకాలి? తనో రాజ్యానికి రాజైవుండి, స్నేహం కోసం కాకపోతే, ఎందుకు అర్జునుడి రథానికి సారథి కావాలి? రాముడిని అనుసరించడంపై నాకింకా చాలా అనుమానాలున్నాయి. కానీ అసలు కన్నా ఈ కొసరు హడావుడి ఎక్కువైందని 'రానారె' విసుక్కుంటారేమోనని ఆపేస్తున్నాను. నా ఉద్దేశ్యం ప్రకారం - రాముడు ఒక కావ్యంలో మామూలు పాత్రగా మిగిలిపోకుండా, దైవంగా కొలవబడటానికి కారణం - ఒక రచయితగా వాల్మీకి తన పాత్రపై చూపించిన అమితమైన అభిమానమే; ఆ అభిమానమే ఒక చారిత్రాత్మక మానవుడికి లేదా ఒక కాల్పనిక కావ్యనాయకుడికి దైవంగా ప్రజల పూజలందుకొనే స్థాయిని కట్టబెట్టింది.
రానారె చెప్పారు…
విసుక్కోవడమా! ఎంతమాట. మీ వ్యాఖ్యలోని భావాలే నావీని. నిర్మొహమాటంగా రాయొచ్చు. మీకు ధన్యవాద శతాలు. చర్చించి తెలుసుకోవడం అభిలషణీయమే కదా! తల్లిదండ్రులమాటను మారుమాట లేకుండా అనుసరించడం కంటే, వారి మాటలోని సాధ్యాసాధ్యాలనూ ఉచితానుచితాలనూ వారితోనే చర్చించి, తరువాతనే ఆచరించే ఈ కాలానికి, "ఎదురు చెప్పకు-కళ్ళుపోతాయ్" అనే మాట అన్వయించదేమోననేదే నా ఉద్దేశంకూడా. ఇందులో ఎవరినీ ఎదిరించడం లేదు, అవమానించడం లేదు, ఎవరికీ అణిగిమణిగి వుండేదీ లేదు. ఆరోగ్యకరమైన చర్చకు ఎప్పుడూ తావుండాలి అంటాను. ఫణీంద్రకుమార్‌గారూ మరోసారి ధన్యవాదాలు.
రానారె చెప్పారు…
"సమస్య ముంగిట నిలిచి అతడు ప్రదర్శించే స్థితప్రజ్ఞత" - ముత్యం లాంటి మాట. స్థితప్రజ్ఞత కలిగివున్నప్పుడు మాత్రమే స్పష్టత, సాధికారత, డిటాచ్‌మెంట్‌తో పరికించడం వంటివి సాధ్యమౌతాయి.

లోకం మెప్పుకోసం దగ్గరి వాళ్ళని కడగండ్ల పాల్జేయడం - ఆత్మకథలో ఒకచోట ఈ ప్రస్తావన తీసుకొస్తారు గాంధీజీ. ఇంట్లో ఒక రోగిని తెచ్చిపెట్టి, అతని మలమూత్రాదులను ఎత్తిపోయించడం కస్తూర్బా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చేయిస్తాడు. తన భావాలను కుటుంబ సభ్యులపైన బలవంతంగా రుద్దడం. ఇది అహింస కాదుకదా! గాంధీగారు స్వయంగా ఈ సంఘటన గురించి నిజాయితీగా బయటికి చెప్పడం వల్ల పాఠకులకు ఆత్మపరిశీలన చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తారు. చర్చలు, బయటకు మాట్లాడటంలోని ఉపయోగం ఇది.
అజ్ఞాత చెప్పారు…
భలేవారండీ ఫణీంద్రకుమార్ గారు,

పోలిక వద్దంటూనే, కృష్ణుణ్ణి బాగానే వెనకేసుకొచ్చారే, మాటలతో తిమ్మిని బమ్మిని చేస్తూ, మీ కృష్ణుడిలా :-)

కృష్ణుడుకి కాంక్ష లేదా? అడుగడుగునా చిన్ననాటి నుంచి ఆయన చేసిన చిలిపి పనులు, సాహస కృత్యాలు ఏంటిట? నోట్లో, విశ్వం చూపించటంలో, పూతన, శకటాసురుణ్ణి చంపటంలో ఆయన ఉద్ధేశ్యం ఏమిటి?

అసలు రామాయణం, భారతం ఏమీ తెలియనివాడికి ఆ రెండూ చదవమనిస్తే, రామాయణంలో ముందేమి జరుగుతుందో అన్న ఆత్రుతయినా ఉంటుందేమో గానీ, కృష్ణుని బాల్యం ఆయన వేలెడంతప్పుడు చూపిన లీలలు చదివాక అసలు భారతం అంతం ఏవిటి అన్నది మొదలెట్టకుండానే తెలుస్తుంది. అసలు సస్పెన్సేది? కృష్ణుడికన్నీ తెలుసు. అయినా తెలియనట్లుంటాడు. ఎవరు చస్తారో, ఎవరు బతుకుతారో, భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ తెలుసాయె. మరి అటువంటప్పుడు అందరూ, అన్యధా శరణం నాస్తి... అంటూ రావటంలో విశేషమేముంది.



తాడేపల్లి వారన్నదే మళ్ళీ చెబుతున్నా, వేర్వేరు కాలాలు, వేర్వేరు పరమార్ధాలు. అసలు పోల్చలేము ఆ ఇరువుర్నీ.
Burri చెప్పారు…
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రానారె చెప్పారు…
అంతర్జాలంలో చర్చ అనేటప్పటికి తమ అభిప్రాయాలు చెప్పేప్రయత్నంలో సమతూకం కోల్పోయి వ్యక్తిగతంగా మారే అవకాశం వుంది. మర్యాదస్తులు పాల్గొనే వేదికగా నా బ్లాగు ఉండాలంటే వ్యాఖ్యాతలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత నాది. విషయం పక్కదోవ పట్టకుండా చూడవలసిందిగా పాఠకమహాశయులకు మనవి.
అజ్ఞాత చెప్పారు…
@రానారె గారు,

నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఉద్ధేస్యం లేకపోయినా, ఆవేశంలో రాసేస్తూ ఉంటాము ఒక్కోసారి. మీ హెచ్చరిక వర్తిచ్చే వ్యాఖ్యలన్నిటినీ నిర్మొహమాటంగా తీసెయ్యండి. ఓ ముక్క అలానే తీసేసానని చెప్తే, అదొక లక్ష్మణరేఖ గా కనీసం మీ బ్లాగు వరకైనా నలుగురికీ తెలుస్తుంది కదా.
అజ్ఞాత చెప్పారు…
కృష్ణుడి చిన్నప్పటి సంగతులన్నీ విపులంగా చూసేదు భాగవతంలో అనుకొంటాను...భారతంలో కాదుగా:)
అజ్ఞాత చెప్పారు…
అనానిమస్ గారూ,

అంతలేసి డిటేల్స్ రాయలేమండి, ఇంత చిన్న కామెంట్ డబ్బాలో. నా మాటకి పూర్తి అర్థం, కృష్ణుడి చిన్నతనం విషయాలు తెలుసుకొని...... అటుపై భారతం చదివితే అని.
Unknown చెప్పారు…
లేటు గా రాస్తున్నా నా అభిప్రాయం.
రామాయణం నాకెంతో ఇష్టం. ఎందుకంటే ఇందులో మిగతా అవతారాల్లో ఉన్నంత అసహజమయిన సన్నివేశాలు ఉండవు. మాయలు, మంత్రాలు కాకుండా ఒక మనిషి లో ఉండే బలహీనతలు ఉండేలా ఉంటుంది అవతారం.
అవును మనుషుల్లో కూడా ఏ ఒక్కరూ ఐడియల్ గా ఉండలేరు. అందరిలోనూ లోపాలు ఉంటాయి. తప్పులు చేస్తారు, దిద్దుకుంటారు.
రామాయణం కూడా అలాగే సాగుతుంది. రాముడి ని నేనెప్పుడూ ఐడియల్ గా చూడలేదు. కానీ రామాయణంలో రాముడి పాత్ర ద్వారా నా చిన్నతనంలో నేను నేర్చుకున్నది చాలా ఉంది.
మొదటిది అనుబంధాలు. అంటే అందరూ అడవులు పట్టి పోవక్కర్లేదు. కానీ అమ్మా, నాన్నలను గౌరవించడం, తోబుట్టువులను గౌరవించడం. గురువులను గౌరవించడం.
రెండోది స్నేహం యొక్క మాధుర్యం, ప్రాముఖ్యం. స్నేహం చెయ్యడానికి చిన్నా, పెద్దా, ఎక్కువా, తక్కువా కాదు. అదీ కాక లాభాపేక్ష కోసం స్నేహం కాదు. ఉదా: హనుమంతుడు ఎంతో బలవంతుడు. ఎవరి అండా, సహాయం లేకపోయినా బలవంతుడే, చిరంజీవే. కానీ రాముడి సాంగత్యంలో స్నేహితుడి పట్ల తన బాధ్యత నిర్వర్తించాడు.
అలాగే సీతా రాముల అనుబంధం లో లోపాలున్నాయి. అవి నిజ జీవితం లో వైవాహిక బంధం లోనూ ఉంటాయి. ఆ దృష్టితోనే చూస్తాను నేను.
ఆఖరిగా ఓ మాట చెబుతాను సరదాకి. రావణుడు పర కాంత కేసి చూడడం వల్లే కదా ఎంత మంచి ఉన్నా చెడ్డవాడయింది. అయితే మనందరమూ రోజూ పక్కన నడిచే అమ్మాయిల కేసి చూస్తూనే ఉంటాము. కాంక్షిస్తూంటాము. అయితే మనందరమూ రావణులమే అన్నమాట :)
(నా ప్రకారం కథని కథ జరిగిన కాలం ప్రకారం కూడా ఆలోచించాలి. అందులోంచి మనం ఏం గ్రహించగలమో అది గ్రహించాలి.)
అజ్ఞాత చెప్పారు…
రానారె గారు అన్నట్టు చర్చను హుందాగా నడిపించాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.

మరొక్క మాట - నిన్న నా వ్యాఖ్యను వ్రాస్తూ తొందరపాటులో ఒక 'తప్పు ' చేసాను. రాముడు తప్పు తన నెత్తి మీదకు వేసుకున్నాడు అని వ్రాసాను. అంటే అక్కడ తప్పు జరిగింది అన్న అర్ధం ధ్వనిస్తోంది. అది నా ఉద్దేశ్యం కాదు. అక్కడ ఉండాల్సింది నింద అని. రాముడు నిందని తనపై వేసుకున్నాడు. ఈ తప్పుకు సీతమ్మవారిని, రాములవారిని మాత్రమే కాక మన నాగరాజుగారికి కూడా క్షమాపణలు అర్పిస్తున్నాను ఆయనను తప్పుగా ఉటంకించినందుకు.
అజ్ఞాత చెప్పారు…
ఇక్కడ రెండు వేర్వేరు పోలికలను ఒక్కటి చేస్తున్నారు. ఒకటి రాముడు-కృష్ణుడు, రెండు రామాయణం-భారతం.
ఈ విషయం పై మాట్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం...మీరు పోలిక తెస్తున్నది అవతార పురుషులుగా కీర్తించబడ్డ రామకృష్ణుల మధ్యా లేదా చారిత్రక రామకృష్ణుల మధ్యనా? అన్నది. వీటిపై ఖచ్చితమైన అవగాహన కొస్తే చర్చలో అసంబద్ధత ఉండదు.

ఇక నా వరకు వస్తే ఈ బ్లాగు రచయిత అన్నట్టు రామాయణ-భారతాల్లో భారతానికే నా ఓటు. ఇక రాముడు -కృష్ణుడు సంగతికొస్తే ఇద్దరినీ దేవుళ్లుగా నమ్మిన పక్షంలో ఏ రకమైన వ్యాఖ్య చేయలేము,తాడేపల్లి గారన్నట్టు కళ్లు పోతాయి.సరే చారిత్రక పురుషులుగా వారి మధ్య పోలిక తెచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సింది తేత్రా-ద్వాపర యుగాలు. కాలం బట్టి మనుషులు మారుతూంటారు. అలా అనుకొన్నప్పుడు కృష్ణుడు మనకు సమకాలీనుడిలా కనిపిస్తాడు. రాముడు ఆదర్శపురుషుడు, కృష్ణుడు లౌక్యం తెలిసినవాడు. ఇద్దరూ మన కాలానికి ఉన్న విలువల పరంగా చూస్తే తప్పులు చేసారు అనిపిస్తుంది. నా వరకు ఇక్కడా కృష్ణుడే ఇష్టుడు.

గార్లపాటి గారన్నట్టు అమ్మాయిలను చూడాలనుకొనే చిత్తచాపల్యం ప్రకారం మీరు కృష్ణులవుతారు కానీ రావణులు కాదు:-)
రానారె చెప్పారు…
వ్యాఖ్యలు రాసివారందరికీ వినమ్రపూర్వక నెనరులు. రాముడు, రామాయణం ... అంటూ జరిగిన ఈ చర్చ [చర్చ కాదు రచ్చ అనిపించి వుండవచ్చు, ఫరవాలేదు :)] వృధాకాలేదు. ఎందుకంటే ... ఒక మంచి ప్రయోజనకరమైన ముగింపు దొరికింది. ఇక్కడ చదవండి.
rākeśvara చెప్పారు…
మీరిచ్చిన లెంకెలూ, ఇక్కడ జరిగిన సెర్చా సదవలేదుగానీ, బ్లాగర్లం కాబట్టి, కొద్దిగా వ్యక్తపరచే దురద ఎక్కువుండడంతో, రాముని మీద నా మతం:
రాముడు గ్రేట్ అండ్ ఆల్ కాని సీతమ్మని అడవుల్లోవదిలేయడం నేను జీర్ణించుకోలేను.
కాని పూజించడం కంటే ద్వేషించడంమే ఎక్కువ ప్రేమించడం, ప్రాముఖ్యత ఇవ్వడం కాబట్టి, నాకు ఏ విధమైన పాపమూ అంటదూ, పుణ్యం కూడా వస్తుంది. ధర్మస్వరూపుడు కాబట్టి రాముడికి ఈ విషయం తెలుసు, అదీ మా మధ్య అండరుస్టాండింగ్.

ఇక భారతంలో ధర్మరాజు నిజంగా ఆసమ్ అనిపిస్తుంది. కృష్ణుణ్ణైనా నేటి జనులు తప్పుబట్టవచ్చుగానీ, ధర్మరాజు ఆ అవకాశఁవే ఇవ్వడు.
కృష్ణునిలా సంపూర్ణ ధర్మస్వరూపులం కాని మనలాంటి వారికి ధర్మరాజే మంచి ప్రాక్టికల్ ఐడియల్ (oxymoron ని మన్నించగలరు) అని నా నమ్మకం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము