మనసు మురిసి పాట పాడే!
ఈ పాటను మొన్నీమధ్యే తొలిసారిగా విన్నాను. అప్పటినుండి దాదాపు వందసార్లు విన్నాను. పాట ప్రారంభంలో "ఏమైందీ..." అంటూ ఉదిత్‌నారాయణ్ పలికే పద్ధతి మొదట్లో నచ్చలేదు. "చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల!?" అనాల్సిన చోట "పోయెనేల!?" అనడం, "ఏ శిల్పి చెక్కెనీ శిల్పం!?" అనవలసిందికాబోలు "ఏ శిల్పి చెక్కనీ శిల్పం" అన్నట్లుగా పలకడం కూడా కలుక్కుమంది.
కానీ ఈ పాటను అంత సులభంగా వదిలేయబుద్ధి కాలేదు. కారణాలు ఏమిటనేది ఎక్కువ ఆలోచించనవసరం లేకుండానే అర్థమైంది - ఈ పాటలోని పదాల శబ్ద సౌందర్యం ఒకటి, అంతే గొప్పగా ఉన్న బాణీ (ట్యూను) రెండవది, ఇందులో వాడిన వాద్యాలూ కోరస్సుల మంత్రశక్తి మూడవది, శాస్త్రోక్తంగా తాళానికి లెక్కాచారంగా ఒక్కోపదాన్నీ పట్టిపట్టి పలికిన ఉదిత్‌నారాయణ్ గాత్రం నాలుగవది.
ఈ నాలుగో విషయం జీర్ణం కావడానికి నాకు కాస్త సమయం పట్టింది. జీర్ణమయ్యాక అతని గొప్పదనం అర్థమైంది. మూడవ విషయం నిజంగానే మంత్రశక్తి కలది. వేణువు-వాయులీనము, చిరుగంటలు-గజ్జెలు, తబలా-డ్రమ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగానూ, కలివిడిగానూ వినవస్తాయి - "చూడు నా ప్రతిభ" అంటూ.
రెండవ విషయం - ఈ పాట బాణీ. ఇటీవలి కాలంలో కాస్త అరుదుగా వినవస్తున్నది సాహిత్యాన్ని అధిగమించని సంగీతం. సాహిత్యంతో సహగమించే సమభోగించే సంగీతం. ఈ స్వరరచన ఆ పని చేసింది. నెలక్రితమే "7/G బృందావనకాలనీ" మొదటిసారి చూశాను. అంతకు ముందు "మన్మథన్" చూశాను. ఈ రెండు సినిమాల్లోనూ సంగీతం (అంటే పాటలేకాదు) ముఖ్యపాత్ర పోషించిందనేది సత్యం. ఇసైజ్ఞానం పుణికిపుచ్చుకున్నాడనిపించుకున్నాడు 'యువ'న్‌శంకర్'రాజా'. ఇతని సంగీతం ఒకపట్టాన మనసును వదిలిపోదు. ఆంధ్రేతరులు పనిచేయడం వలన ఈ పాట పాడైందని కొట్టివేయనక్కరలేదు.
మొదటి విషయం - పదసౌందర్యం. గొప్ప సాహిత్యం కాకపోవచ్చు. కానీ హృద్యమైన సాహిత్యం. ఈ పాటలోని మిలమిల-చిటపట, కులుకులు-చెమటలు, వెలవెల లాంటి జంటపదాలు దీనికొక సొగసు తెస్తాయి. "ఆమె నన్నిలా చూస్తే - ఎద మోయలేదు ఆ పులకింత" - ఈ అనుభవం బహుశా మనలో అందరికీ ఒక్కసారైనా అనుభవంలోనికి వచ్చివుంటుందని అనుకుంటాను. "తన నడుము ఒంపులోనే - నెలవంక పూచెనా" ఇది నేను ఎప్పుడూ వినని కొత్త ప్రయోగం. నడుము ఒంపులో కడవ, మడత, చెమట, మచ్చ ఇలా దృగ్గోచరాలే చూశాం. కానీ ఈ 'కవి'కులశేఖరుడు కాంచినది మాత్రం కొత్తసంగతి.
తెలుగుపాటలు వర్థిల్లాలి.
కామెంట్‌లు
అతను చాలా చాలా గొప్ప హిందీ గాయకుడు అందులో సందేహం లేదు. హిందీ లో పాడితే అతనిలా పాడల అన్నట్టుంటుంది. కానీ తెలుగు ? వద్దులెండి మాకు.
మంచి పాటను పరిచయం చేసారు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.