Monday, June 04, 2007

గురుః దేవో నారాయణః

కం.
సుందరమై జగమంతయు
గంధపు పరిమళము నింపు కాంచనమయమౌ
కందము నీకై కూర్చితి
నందుకొనవయా మదీయ కవనాచార్యా!

సర్లేగానీ ఇంతకూ ఆ కందమెక్కడ అంటారా!? తెలుగు పద్యరీతుల్లో కందపద్యాన్ని కడు రమ్యమైనదని చెబుతారు కదా! ఆ మాటను పట్టుకొని అటు కందమునూ, ఇటు దాని మూలాలను నాకు తెలియపరచిన మా గురువుగారినీ గుర్తుచేసుకుంటూ ఈ పద్యం రాశాను. పద్యం చెప్పడమే సరిగా అలవడని నాలాంటివాడి చేతిలో కందంకూడా కందిపోయి అంత అందంగా కనిపించకపోవచ్చు. మొదట్లో కాస్త కష్టమనిపించినా పద్యపు నడకను పట్టుకున్నాక అలవోకగా చెప్పవచ్చునట. చదువరులకు కూడా కందపద్యం చాలా బాగుంటుంది-ట. సుమతీశతకపద్యాలన్నీ కందపద్యాలే.

నాలుగు పద్యాలనైనా ఖూనీ చెయ్యందే రాసే విద్య రాదుకదా. అందులో భాగంగా ఇటీవలే నేను చేసిన ఖూనీ సుజనరంజనమైనది. అక్కడే మన కేవీయస్ చెప్పిన పద్యాలు కూడా ఉన్నాయి. అవి బాగున్నాయి.

6 comments:

రాకేశ్వర రావు said...

మిమ్మల్ని చూసి నేను కూడా, కందం లాంటి చిన్న తరహా పద్యాల్ని రాయాలని స్ఫుర్తి పొందాను.

నా గురువుగా మీకే అంకితం చేస్తా :)
వచ్చే ఒక సంవత్సరంలో ఇది ఎప్పుడైనా జరగవచ్చు :)

రానారె said...

ఈ పద్యంలో ఒక తప్పును పట్టించి ఇచ్చిన రాకేశ్వరరావుగారికి కృతజ్ఞతలు. ఇప్పుడు సరిద్దాను.
రాకేశ్వరా, మీకు సంవత్సరం అవసరం లేదు. సుజనరంజనిలో సమస్యాపూరణం ఉంది చూడండి. పద్యం-హృద్యం అనే శీర్షికన. కందపద్యంలోని ఒక పొడుగు పాదం వాళ్లే ఇచ్చేశారు. మిగతా మూడే మనం పూరించాల్సినవి. పుష్కలమైన మంచి ఆలోచనలుగల మీకు ఇది పెద్ద కష్టమేమీకాదు. పైగా ఛందస్సుకు సంబంధించిన ముడిసరుకు మీ మస్తిష్కంలో ఇప్పటికే ఉంది.

కొత్త పాళీ said...

ఏందబ్బయా, మరీ ములగ చెట్టెక్కించేత్తన్నవు? ఏంది కత? :-)
గంధపు పరిమళము నింపు కాంచనమా?
బంగారానికి తావి యబ్బినట్లు - బాగుంది.
అవును మంచి కందం కుందనపు బొమ్మే, దానికి గంధప్పూతే! నిజమే.
అన్నట్టు నీ - నా కందాల అనుబంధం ఎప్పుడో మొదలైంది నీకు గుర్తుందో లేదో - ఇక్కడ చూడు.
http://kottapali.blogspot.com/2007/03/blog-post_16.html

రానారె said...
బ్లాగుబోతుతనం మెండుగా ఉన్నవారిని బ్లాగ్పోతన అనడం సబబేగదా!? మీరు కవియైన సందర్భంలో మీకిదే మా బిరుదుసత్కారం. కందం కందంలానే రాశారు అందంగా, జిగటగా. బాగుంది. నేనూ ప్రయత్నిస్తా.

కొత్త పాళీ said...
క. కందాలకేమి భాగ్యము
వందైనా రాయ వచ్చు వడిగా, కానీ
ఛందస్సున వ్రాయుచునే
యందముగా వ్రాయవలెను యర్రపు రామా!

రానారె said...

గురువుగారూ, క్షమించాలి. నిజంగానే మరచిపోయాను. మీకు బిరుదుసత్కారం చేశాక, నేను మళ్లీ ఆ పోస్టువైపు చూడకపోవడంవల్ల ఇదంతా జరిగింది. సుమారుపాటి నేరమే చేశాను. మీరే మళ్ళీ గుర్తు చేయాల్సిరావడం నాకు సిగ్గుచేటు. బిరుదాన్నిచ్చి, దాన్ని నేనే మరచిపోయి ... ప్చ్! ఏమైనా, మంచి సందేశం అందజేశారు. నా బండి కొంత ఆలస్యమే అయినా ఉప్పడు అందుకున్నాను.

Sriram said...

"నాలుగు పద్యాలనైనా ఖూనీ చెయ్యందే రాసే విద్య రాదుకదా. అందులో భాగంగా ఇటీవలే నేను చేసిన ఖూనీ సుజనరంజనమైనది. అక్కడే మన కేవీయస్ చెప్పిన పద్యాలు కూడా ఉన్నాయి. అవి బాగున్నాయి."

పద్యాలు చెప్పడానికి మీ ప్రయత్నం చూసిన తర్వాతే నేను మొదలెట్టా. మీరు చేసింది ఖూనీ ఐతే మరి నేను చేసినదాన్ని ఏమనాలో...

ఏమైతేనేం గురువుగారి మీద పద్యం చెప్పి మార్కులు కొట్టేసారు, మరి ఇంక మీదే ఫస్ట్ రేంకు. నేను ఇంక పంతులోరిని ఇంప్రెస్ చెయ్యడానికి ఇంటినుంచి యే జున్ను పాలో తేవలసిందే :)

రానారె said...

:)

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.