Thursday, May 10, 2007

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!!

అమ్మాయిని చూడ్డానికొచ్చినవాడు రిషభాన్ని వృషభం అనగానే శంకరశాస్త్రికి ఒళ్లూపైతెలీకుండా పోతుంది - శంకరాభరణం సినిమాలో. "మన తెలుగుభాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం, కాపాడుకుందాం ..." ఇలాంటి మాటలు ఎవరినోటైనా వింటే నాకూ అంతే.

"బ్రతికించుకోవడమేమిటి నీబొంద? అదొక ఘనకార్యమన్నట్లుగా చెబుతున్నావు! నువ్వు బ్రతికించకుంటే భాషకేమిటి నష్టం? అది చచ్చి ఊరుకుంటే ఎవరిదేం పోయింది? అవసరం లేనపుడు 'రక్షించుకోవడమ'నే బరువును ఎవరైనా ఎందుకు మోస్తారు" అని అడుగుదామనిపిస్తుంది.

తెలుగు అవసరమే లేకుండా ఆనందంగా బతుకుతున్న తెలుగు(వారి)బిడ్డలకు ఈ మాటలు అర్థవంతంగా అనిపిస్తాయనుకుంటా. కొన్ని సమావేశాల్లో కొందరు పెద్దమనుషులు చెప్పే ఈ బరువు మాట, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై మోపుతున్న ఈ బరువు - అర్థరహితంగా కనిపిస్తాయి.

భాషలో మన సంస్కృతి మూలాలున్నాయి. మంచి నడవడినీ, ఆధ్యాత్మిక చింతననూ, సామాజిక స్పృహనూ, తద్వారా ప్రశాంత జీవనాన్ని సాగించే సమాజాన్ని కొన్ని శతాబ్దాలుగా సాధ్యపరచింది మన మాతృభాష. మన భాషను అనుసరించి వచ్చిన సంగీతము, పురాణ పారాయణ కాలక్షేపాలు, హరికథలు, పిట్టకథలు, తోలుబొమ్మలాటలు, వీధినాటకాలు, మరియు ఇతర కళలు ఇవన్నీ చేస్తూవచ్చిన పని ఇదే. మన భాషలోని సామెతలు, సూక్తులు, చతురోక్తులు, నుడి, నడవడి, పద్యాలు ఇవన్నీ ఇందులోని భాగాలు.

వినోదాన్ని అందించడంతోబాటు మనోవికాసం, మంచి నడవడి, సహనం, సహజీవనం, ఆధ్యాత్మిక చింతన మనకు తెలీకుండానే మనలోకి ప్రవేశపెడుతూ వచ్చాయి ఇవన్నీ. దాని అవసరమేమిటో మన పిల్లలకు అర్థమయ్యేలా చేయగలిగితే, అందులోని వినోదాన్ని, మజాను మన పిల్లలకు అందించగలిగితే - ఎవరి ప్రయత్నంలేకుండానే భాష వృద్ధిచెందుతుంది. ఇది జరగాలంటే తెలుగుభాషలోని మజానూ, తీయదనాన్ని, తెలుగుమాట, రాత, పఠనములలోని సౌఖ్యాన్ని మనం అనుభవించినవారమై ఉండాలి ముందుగా.

"బ్రతింకించుకోవలసిన, రక్షించుకోవలసిన, కాపాడుకోవలసిన" దుర్గతి తెలుగు భాషకు పట్టలేదు. భాషను ఉద్దరించడమంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే. తెలుగు భవితవ్యాన్ని గురించి అదేపనిగా బెంగపెట్టేసుకుని బాధపడేవారు చేయవలసిన మొదటి పని ఏమిటంటే - ఈ పన్నాలు మానటం. మానిన తరువాత - తాము స్వయంగా తెలుగు తీయదనాన్ని ఆస్వాదించడం.

ఎలా ఆస్వాదించాలి? ఇంతకాలమూ "తేనెకన్నా తీయనిదీ తెలుగుభాష" అని పాడటం తప్పించి ఆ తీయదన్నాన్ని తామెప్పుడైనా చూశారేమో గుర్తుతెచ్చుకోవాలి. తప్పకుండా చూసే ఉంటారు. ఏదో గొప్ప మహాభారత పద్యంలోకాకపోయినా, ఏదైనా ఒక వేమన పద్యంలోనో, కనీసం సీతారామశాస్త్రి పాటలోనో ఆ రుచి చూసే ఉంటారు. ఆ రుచి ఇంకా ఎక్కడ దొరుకుతుందో వెతకాలి. మంచి తెలుగుపుస్తకాలను, కథలను చదవటంలోని సౌఖ్యాన్ని అనుభవించడం, భాషను అర్థం చేసుకోవడం, వేమన పద్యాలను నేర్చుకోవటం, సందర్భానుసారంగా ఈ పద్యాలను, సూక్తులను, సామెతలను వాడటం, చలోక్తులు విసరడం... ఇలాంటివి మనకు ఒక గౌరవాన్ని తెస్తాయి. నలుగురు తెలుగువాళ్లున్నచోట మీరు ఆంగ్లంలో వెలగబెట్టకపోయినా, మీ గౌరవానికీ ఆత్మాభిమానికేమీ ఢోకాలేదని గుర్తించాలి. మంచి తెలుగు మాట్లాడేవారికి మంచి గౌరవం లభించడం మెల్లగానైనా మీకు అనుభవంలోకి వస్తుంది. ఆంగ్లం వద్దనికాదు. జీవన వ్యాపారానికి అది ఇప్పుడు తప్పనిసరి. కాబట్టి నేర్చుకుందాం. అవసరమైనప్పుడు అదరగొడదాం. అవసరమైనప్పుడే.

పోయినవారం డాలస్ (డల్లాస్)లో జరిగిన - టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు - వెళ్లాను. యాభైదాటినవారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికీ, అది వినడానికి కొందరైనా ఉన్నారేమోనని తడిమి చూసుకోవడానికి తప్ప, యువతలో మన భాషపై, సాహిత్యంపై మక్కువ పెంచే దిశగా ఏమీ జరగలేదు. ఆ సదస్సు నిర్వాహకుల హాస్యచతురత, ఒకాయన బ్లూటూత్ పై ఆశువుగా చెప్పిన సీసం, ఒకామె చదివిన వ్యాసం తప్పితే ... ప్చ్... ఆ ఖర్చులు భరించిన ఒక డాక్టరుగారు పాడిన జానపదాలు బాగున్నాయి (నిజంగానే). ఆ సదస్సులోని ఒక పెద్దాయన మైకాసురుడు (మైక్ చేతికివ్వగానే సాటిమనుషులపై జాలిలేకుండా, ఇంకో రెండు నిముషాలు అంటూ, స్వోత్కర్ష)గా మారి కొంత ఇబ్బందిపెట్టారు. నిర్వాహకులు ఆయన కాళ్లూగడ్డం పట్టుకొని బలవంతంగా చివరికెలాగో మైకు లాక్కొన్నాక సదస్సు ముగిసింది. అదేదీ నాకు చెందినదిగా అనిపించక, నేను వెంటనే అక్కడినుండి హ్యూస్టన్‌కు పలాయనం చిత్తగించాను.

ఒంటరిగా హైవేలో నాలుగు గంటలు కారు నడపగలనన్న నమ్మకం కలగడం ఇందులో నాకు లభించిన అనుభవం. డాలస్‌కు బయలుదేరిన కొద్ది నిముషాల్లోనే గంటకు అరవైఐదు మైళ్ల గరిష్ట వేగపరిమితి గల రహదారిమీద ఎనభైరెండులో వెళ్తున్న నన్ను ఒక పోలీసుమామ ఆపి ఆహ్వానపత్రిక ఇచ్చి కోర్టుకు రమ్మన్నాడు. పత్రికపైన నా చేవ్రాలుతో ఒట్టువేయించుకొని తప్పక వస్తానని హామీ పొందాడు కూడా. ఆ అనుభవం కూడా చూడాలి ఎలా ఉంటుందో. ఆ రోజుకోసమని ఈరోజే ఆఫీసులో సెలవుకూడా తీసుకొన్నాను.

12 comments:

Sriram said...

భళా! నాకు చిన్నప్పుడు చదువుకున్న పానుగంటివారి సాక్షిలోని స్వభాష వ్యాసం గుర్తొచ్చింది. అంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? నవీన జంఘాలశాస్త్రి అవతారమెత్తి అక్కడ ఒక బ్రహ్మాండమైన ప్రసంగం ఇచ్చి ఉండాల్సింది.

అన్నట్టు ఈ మధ్య హైదరాబాదు దూరదర్శన్ వారు అక్కడ జరిగిన హాస్యనాటికల ప్రదర్శనని ప్రసారం చేసారు. అందులో ఈ స్వభాష వ్యాసం నాటికగా వేసారు. ఒక పెద్దాయనెవరో జంఘాలశాస్త్రి పాత్ర అద్భుతంగా పోషించారు.

రానారె said...

శ్రీరామా, అనువుగానిచోటు అయింది. అధికులమనరాదు అన్నాడుగదా మా'నవ' కులపెద్ద. పోతే, ఇక్కడ కళాకారులు చాలా గొప్పగొప్పవారున్నారని విన్నాను. చూడలేదింతవరకూ.

Sriram said...

చిన్న వివరణ:

పై వ్యాఖ్యలో
అక్కడ=హైదరాబాదు

సినారె గారి అధ్యక్షతలో "తెలుగు సాహిత్యంలో హాస్యం" అనే వర్క్‌షాప్ లో భాగంగా జరిగిన కార్యక్రమం అది.

kiraN said...

భలే రాసావ్‌లే.. ఎప్పటిలానే..

- కిరణ్

కొత్త పాళీ said...

@రానారె - తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు అన్నట్టు బోరైన అనుభవాన్ని పిండి మంచి టపా లాగావు. అమెరికాలో సెటిలైన ప్రవాసభారత గుంపుల్లో ఉన్న రాచరికాలూ, జమీందారీలూ తరతమభేదాలూ నీకింకా అనుభవంలోకి రాలేదు. ఇట్లాంటి ఇంకో నాలుగు సమావేశాలకి వెళితే వస్తై.

రాకేశ్వర రావు said...

"
తెలుగు అవసరమే లేకుండా ఆనందంగా బతుకుతున్న తెలుగు(వారి)బిడ్డలకు ఈ మాటలు అర్థవంతంగా అనిపిస్తాయనుకుంటా. కొన్ని సమావేశాల్లో కొందరు పెద్దమనుషులు చెప్పే ఈ బరువు మాట, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై మోపుతున్న ఈ బరువు - అర్థరహితంగా కనిపిస్తాయి.
"

ఈ పారా నాకు అస్సలు అర్థంకాలేదు. మిగతా టాపాతో నేను పూర్తిగా ఏకీభవిస్తా.

నేను చికాగో లో ఉన్నప్పుడు, అక్కడ రెండు తెలుగు సంఘాలు ఎందుకు వున్నాయంటే,
"ఒకటి రెడ్డి మరొకటి కమ్మ domination" అని విని, వికారం పుట్టింది.

ఛీ అనిపించింది. రామేశ్వరం వెళ్ళినా ... అన్నట్టు.
పిల్లలతో మరియు తమలో తాము తెలుగు అందాన్ని పంచుకోవడం మానేసి, ఈ విభజన ఏంటిరా అనుకున్ననా...

రాకేశ్వర రావు said...

అన్నట్టు మీరు అమెరికా లో ఉంటారని తెలియదు...
మంచిది.

రానారె said...

రాకేశ్వరా, అర్థంకాలేదన్న భాగానికి సంబంధించి మీకొక ఉదాహరణ చెబుతాను - ఆంధ్రుల కుటుంబం ఒకటి ప్రవాసానికెళ్లి, వెళ్లినచోటనే ప్రసవించి, వారి బిడ్డలను ఆ ప్రదేశపు జనజీవన స్రవంతిలో కలిపి పెంచారనుకుందాం. వారు అక్కడి స్థానికులలాగానే తెలుగుభాష అవసరం లేకుండానే ఆనందంగా జీవించగలరు కదా. అలాంటి పిల్లలతో "తెలుగు నేర్చుకో, మరువకు, బ్రతికించు" అంటే "ఎందుకు అనవసరంగా" అనే ప్రశ్న ఉదయిస్తుంది కదా. ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ముందుగా ఆ తల్లిదండ్రులకు తెలుగుభాష ఎందుకు తీయనైనదో అవగాహనా అనుభవమూ ఉండాలి కదా. అవి సంపాదించాలి. అప్పుడు భాష ఎంత రుచికరమైనదో అనుభవంలోకొచ్చాక, ఆ రుచిని తమ పిల్లలకూ చూపించాలి. ఈ పాటను ఇక్కడ కొరికి చూడు, ఈ పద్యాన్ని ఇలా నమిలిచూడు, ఇక్కడ ఈ శ్లేష చూడు, ఈ సామెత ఎంత అద్భుతంగా ఉందో చూడు ... ఇలాగ. పిలలు ఆ రుచి మరిగితే చాలు. మరి వదలరు. ఇలా చేయగలిగితే, భాషను ప్రత్యేకంగా ఎవ్వరూ పనిగట్టుకొని రక్షించనవసరం లేదు - అన్నది నేను చెప్పదలచుకొన్నది. ఈ మాటలు ప్రవాసాంధ్రులకంటే సహవాసాంధ్రులకే ఎక్కువగా వర్తిస్తాయని నా నమ్మకం. ఇప్పుడర్థమైందా?

chaitü said...

చాలా రోజులైంది మీ బ్లాగ్ కి వచ్చి...
కిరణ్ బ్లాగ్ లో ఇదే పేరు తో ఉన్న పోస్ట్ చూసి, ఆ లింక్ నుండి ఇక్కడికి వచ్చాను...

అక్కడ మీరు చెప్పింది నిజమే... తెలుగు దేశం లో పుట్టిన ప్రతిఒక్కరూ తెలుగువారే, మాతౄభాష తో నిమిత్తం లేకుండా...

ఈ వ్యాసం చాలా బాగుంది...
కిరణ్ చెప్పినట్టు ఎప్పటిలాగానే చాలా బాగా చెప్పారు.

రానారె said...

చైతన్యగారు, చాలా సంతోషం. పునఃస్వాగతం.

varttik said...

"బ్రతింకించుకోవలసిన, రక్షించుకోవలసిన, కాపాడుకోవలసిన దుర్గతి తెలుగు భాషకు పట్టలేదు"."భాషను ప్రత్యేకంగా ఎవ్వరూ పనిగట్టుకొని రక్షించనవసరం లేదు" అన్న రానారె నిజంగా David Crystal రాసిన Language Death చదవాలేమో. ఇప్పుడు సజీవంగా ఉన్న భాషలలో 90% వరకుఈ శతాబ్దాంతానికి లుప్తమైపోతాయన్న David Crystal ఊహాగానం. Brenton అన్న భాష మాట్లాడే ప్రజలు 20వ శతాబ్దారంభంలో ఫ్రాన్స్ లో ఒక మిలియన్ ఉండగా ఇప్పుడు ఆ జనాభా అందులో 25 శాతానికి పడిపోయింది. ఆధునిక యుగానికి , 21వ శతాబ్దంలోని సాంకేతిక అభివృద్ధికి అవసరమైన విధంగా పనిగట్టుకొని భాషనుతీర్చిదిద్దే తీవ్ర కృషి జరగకుండా, కేవలం మన పిల్లలకు తెలుగు భాష తియ్యదనాన్ని రుచి చూపించినంత మాత్రాన తెలుగు భాష సజీవ భాషగా మనగలదని నాకనిపించదు. నువ్వేమంటావ్?

రానారె said...

"21వ శతాబ్దంలోని సాంకేతిక అభివృద్ధికి అవసరమైన విధంగా పనిగట్టుకొని భాషనుతీర్చిదిద్దే తీవ్ర కృషి" - ఉపయోగపడే కోణం. ధన్యవాదాలు సురేశ్‌గారు, అయితే, ఎవరు చేస్తారీ కృషి? "దానికో బ్లాగర్లసంఘం ఉంది, కొన్ని వెబిజైన్లు నడిపేవాళ్లున్నారు, వాళ్లు చూసుకుంటారులే, ఈ శతాబ్దాంతానికి అంతరించిపోయే దాంతో మనకెందుకు శ్రమ, ప్రకృతిలో పరిణామం సహజం, ఎన్ని జాతులు అంతరించలేదు, ఎన్ని కొత్తవి పుట్టడంలేదూ, ఇదీ అంతే, Survival of the fittest, ఆ fitness తెలుగుకు లేకపోయింది గనక అది నిలబడలేదు, ఐనా ఇంగ్లీషుండగా సాంకేతికాంశాలను తెలుగులో ఎందుకు చెప్పాలి, చెప్పకపోయినా మాకేమీ ఇబ్బంది కలగలేదే ..." ఇలా మాట్లాడేవాళ్లు కొందరున్నారు మన నవతరంలో. వీరికి సమాధానం చెప్పాలంటే తెలుగుభాష రుచి చూపించాల్సిందే అని నా ఉద్దేశం. తెలుగు ఎందుకు తీయనైనదో, మాతృభాషలో సాంకేతికాంశాల వలన ఒనగూడే ప్రయోజనాలేమిటో, జపాన్ వాళ్లు, చైనావాళ్లూ ఎందుకు వాళ్ల మాతృభాషల్లో పట్టుబట్టి కంప్యూటరీకరణ చేస్తున్నారో మనం తెలుసుకొంటేనే ఆ తరువాత 'పోతేపోనీ' అనేవాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలం. అప్పుడు అందరూ మనతో కలుస్తారు. అలా కాక, "మాతృభాషను కాపాడుకుందాం" అంటే అదొక బాధ్యతగా కాక, పనిలేనివాడి ప్రేలాపనలాగా కనిపిస్తుందని చెప్పడం కూడా ఆ టపాలో నా ఉద్దేశం. ఈ తరంలో యువతీయువకులు తెలుగు పట్ల ఎంతో అభిమానం కనబరుస్తున్నారు, తెలుగువాళ్లం అని చెప్పుకోవడానికీ, తెలుగులో మాట్లాడటానికీ, తెలుగు పుస్తకాలు చదటానికీ ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిస్థితిలో, "ఎందుకు" అనేవారి ప్రశ్నలకు సరైన సమాధానం మనం ఇవ్వకుండా "అది నీ మాతృభాష" అని సెంటిమెంటు అంటగడితే విరక్తి మరింత ఎక్కువయ్యే అవకాశాలే ఎక్కువ అని నా ఉద్దేశం. సాంకేతికాంశాలను తెలుగులోకి తేవడం అన్నది తమిళులు చురుగ్గాచేసుతున్నారని ఒక మిత్రుని ద్వారా తెలిసింది. ఎందుకు అంటే "అది మా మాతృభాష" అనేది అతని సమాధానం. మన భాషపైన మనకు అంతటి (గుడ్డి!?) ఆప్యాయత లేదుగనక, ఈ సమాధానం మనవాళ్లను తృప్తిపరచదు గనుక, సరైన సమాధానం వెదకాలి. సమాధానం చెప్పి ఔననిపించగలగాలి. "... ఏమిటి? నీ బొంద!!" అనే ప్రశ్నకు సమాధానం వెదికే ప్రయత్నం ఈ టపాలో మీకు కనిపిస్తుందా ...!? మీలాంటివారి సంభాషణలతో, చర్చలతో, అభిప్రాయాలతో, ఆలోచనలతో పై ప్రశ్నలకు గట్టి సమాధానం ఇవ్వగలమని నా నమ్మకం.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.