Wednesday, April 11, 2007

డెబ్బై ఆరేళ్ల బుడుగు

డెబ్బై ఆరేళ్ల బుడుగు తన బాల్యం గురించి చెప్పిన సంగతులు.

బాపు-రమణ ద్వయంలోని ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఆలోచనకు రాగానే వెంటనే స్ఫురణకు వచ్చే "బుడుగు" ఆయన చిన్నప్పటి ముద్దుపేరు. ఆయన తన బాల్యమును గురించి ఆంధ్రజ్యోతి వారి కోరికమేరకు ఉగాది సంచికకు రాసిన ఇటీవలి రచన చదువుతూ ఉండగా ఒక వాక్యం నన్ను కట్టిపడేసింది. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఆస్తులను, ఆడంబరాలమూ కోల్పోయి, అమ్మ చేసే కష్టంతో వచ్చే చాలీచాలని సంపాదనతో చెన్నపట్నం(చెన్నై)లో మొండిగా బ్రతుకు బండిని లాగుతున్న రోజులను ఆయన ఇలా గుర్తుచేసుకుంటారు:

"ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్లేవాళ్లం. పొద్దున్న ఏడునుంచి, సాయంత్రం ఏడుదాకా నిలబడి కంపోజింగ్ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెళితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలున్నరకి వెళితే ప్రెస్సు వాళ్లు ఏదేనా పెట్టేవాళ్లు. మేమిద్దరం తినేవాడిని." -- -- తల్లీకొడుకులిద్దరూ ప్రెస్సువాళ్లు పెట్టింది "తినేవాడు". అంత సేపు నిలబడి పనిచేసిన తల్లి, దొరికిన ఆ కాస్త తిండినీ తాను తిన్నట్టుగాచేసి బిడ్డకే పెట్టే పరిస్థితిని "మేమిద్దరం తినేవాడిని" అనే వాక్యంలో మన కళ్లకు కడతారు రమణ.

ఇలాంటి వాక్యాలు రమణ రచనల్లో కోకొల్లలు అంటారు. మీరు చదివిన లేదా విన్న రమణ రచనల్లో మీకు స్ఫురించే ఘట్టాలు, సందర్భాలు, చురకలు, చమత్కారాలు ఏవైనా ...!!??

5 comments:

సిరిసిరిమువ్వ said...
This comment has been removed by the author.
సిరిసిరిమువ్వ said...

ఇది ముళ్ళపూడి గారి కదంబ రమణీయం-2 లో వుంది. ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. ఇది చదువుతుంటే ఒక పక్క నవ్వు వస్తుంది, ఇంకో పక్క అప్పటి పరిస్థితులకి జాలి కలుగుతుంది.

ఆ మాతృమూర్తి థైర్యానికి సేవాగుణానికి చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఇద్దరూ చక్కగా స్నేహితులులాగా వుంటారు. అలాంటి తల్లిని పొందిన ముళ్ళపూడి గారు నిజంగా ధన్యజీవులు. జోహర్లు, జోహర్లు కక్కమ్మా (ముళ్ళపూడి వారి భాషలో కక్కమ్మకు జేజేలు)

ఒక్కసారి ఈ వ్యాసం పూర్తిగా చదవండి (చదివి ఉండకపోతే). ఈ వ్యాసం మొదటగా "అమ్మకు జేజే" అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. ఈ వ్యాసం పూర్తిగా చదివితే ఇంకా బాగుంటుంది.

రానారె said...

సిరిసిరిమువ్వగారూ, దాదాపు ప్రతి అమ్మా ఒక కక్కమ్మే కదూ! ఈ విషయంపై మన సాహిత్యం బృందంలో ఆసక్తికరమైన మంచి చర్చ జరుగుతోంది. మీరూ సభ్యత్వం తీసుకొని పాల్గొనండి.

రాకేశ్వర రావు said...

మీరు quote చేసిన text అలా చదువుతుండగా...
ఆఖరి పదం sudden brake లా అనిపించింది. అదే అనుకుంట మంచి రచయకలకు మామూలి వారికి తేడా.

ప్రసాద్ said...

"మేమిద్దరమూ తినేవాడిని" చూసి రానారె అచ్చుతప్పు రాశారా అనుకున్నా! అయితే అదే అసలు మర్మమని తెలిశాక, నవ్వూ, ఏడుపూ వచ్చాయి.

--ప్రసాద్
http://blog.charasala.com

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.