దేవునికి ఒక సిఫారసు అనబడు రెకమండేషన్
అన్ని ప్రయత్నాలూ బెడిసికొడుతున్నప్పుడు, మానవప్రయత్నం ఫలించనపుడు, మనుషులసాయం అందనపుడు, అద్భుతమేదైనా జరిగి అప్రయత్నంగా మన పనిజరిగిపోతే బాగుండుననిపించడం సహజమే. మానవ ప్రయత్నం నిజాయితీగా చేసివుంటే అది ఫలించనపుడు చివరిగా అద్భుతాన్ని ఆశించడం స్వార్థమెలా ఔతుంది? మీరన్నట్లు దేవుడు అప్పుడు గుర్తుకురావడంవల్ల తప్పుచేస్తున్నామనే భావన మనకుండకూడదు. అసలు దేవుడనేవాడుంటే నిజాయితీగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించనందుకు తప్పుచేస్తున్నాననే భావన దేవునికే కలగాలి. పూజించనందుకు, భజించనందుకు మీపై కక్షగడితే వాడసలు దేవుడేకాడు. ఒక్కమాటలో చెప్పాలంటే- కర్మణ్యేవ అధికారః తే|| దేవుని కాకాపట్టడం తప్పు. ఆ సంగతి దేవునికి తెలిసేవుంటుంది. లేకపోతే నాలాంటివాళ్లను ఇంతసుఖంగా బతకనివ్వడు. ఎందుకంటే నా పనేదో నేను చేసుకుపోవడం తప్ప ఏనాడూ దేవునికి హాయ్ హెల్లో కూడా చెప్పను. మనపని మనం వేరెవరికీ హానికలిగించకుండా చేసుకుపోవడమే మన చేతుల్లో వుంది. అదే ధార్మికజీవనం అని నాకు తెలిసినది. అనవసర నమ్మకాలు, అపోహలు, పూజలు, భజనల లాంటివాటితోకూడిన సంక్లిస్టజీవనశైలులు మనఃశాంతినిదూరంచేసి, మనసులో భయాన్ని అనుమానాల్ని నాటే అవకాశం ఎక్కువ. సరే ఒకవేళ దేవుడనేవాడే వుంటే, వాడిసాయం నిజంగా నీకవసరమైతే, సర్వాంతర్యామియైనవాడుగనుక వాడంతటవాడే నీకు సాయపడతాడు. నువ్వేం టెంకాయలుపగలగొట్టి చప్పుడుచేసి, పొగబెట్టి, డప్పులుకొట్టి, "సామీ రోంత ఇట్టా సూడు" అని చెప్పాల్సిన అవసరంలేదు. నీపని నువ్వుచేసుకుపో, దేవునిపని దేవుడు చేసుకుపోతాడు. నీ పూజలు భజనలతో వానిపనికి అడ్డుతగలకు. ఇదీ నా మతం.
కామెంట్‌లు
ప్రతి పనిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. మన పనులు, దేవుని పనులు, ఇతరుల పనులు. చివరి రెండింటి మీద మన నియంత్రణ, అజమాయిషీ పనిచెయ్యదు. మన పనులు మనము చెయ్యకుండా మిగిలిన రెండు పనులు నియత్రించడానికి ప్రయత్నించినప్పుడే తలనొప్పులు తధ్యము.
నేనిదివరకు చాలాసార్లు నా బ్లాగులో చెప్పినట్లు ఎవరినడిగి సూర్యుడు వెలుగిస్తున్నాడు? నది నీరిస్తోంది?...
భజన చెయ్యడం, పూజ చెయ్యడం, కీర్తించడం ఏ విధమైన పుణ్యకార్యాలో నకు బుర్ర చించుకునా ర్థం కాదు. నిజానికి భజన, పూజ, కీర్తన దేవుడి మీద అచంచల ప్రేమ, భక్తి వుండీ (ఓ అన్నమయ్యలా, త్యాగయ్యలా, మీరాలా) చేసినా, పాడినా తప్పులేదు. ఎందుకంటే దేవుడి నుండీ ఏమీ ఆశించకుండా వెన్నెలను కవి పొగిడినట్లు దేవుడున్నాడని, అతనికి గొప్పదనమాపాదించి, ఈ అందమైన సృష్టి అతని వల్లనే అని అతన్ని కీర్తిస్తే, పూజిస్తే అది వాళ్ళ భక్తి.
కానీ ఇప్పుడు 99 శాతం జరుగుతున్న తంతు వేరు. అయ్యా నాకు పలానా కాంట్రాక్టు దక్కాలి, నాకు పలానా ప్రమోషన్ రావాలి అని కొబ్బరికాయలు కొట్టడం, ప్రసాదాలు పెట్టడం (మళ్ళీ పెట్టిన వాడే తింటాడు, కనీసం బయట వగురుస్తున్న కుక్కకు కూడా పెట్టకుండా!) ఇవన్నీ చాదస్తం. ఇలాంటి భక్తులు అనుకుంటున్నట్లే మన ఆలాపనలు విని దేవుడు ఇవ్వగలిగే వాడైతే వాడంత అమాయకుడు, అజ్ఞాని ఇంకొకడు వుండడు.
--ప్రసాద్
http://blog.charasala.com
వ్యక్తిగతంగా చూస్తే నేను దేవుడనే భావనను నమ్ముతాను కానీ ఉన్నాడో లేడో తెలియదు అంటాను.కానీ కష్టకాలంలో చేసే ప్రార్థన మనమీద మనకున్న నమ్మకాన్ని పెంచుతుంది,మనకంటూ ఓ ఆప్తుడు ఉన్నాడనే భరోసానిస్తుంది, ఆ కష్టం తొలగే వరకు మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.మనమేమీ చేయకుండా సర్వం నీవే,కొండకొస్తా, హజ్ చేస్తా,చర్చికి దానమిస్తా నాక్కావాల్సింది ఈ ప్రభూ అంటే మాత్రం గాలిలో దీపం పెట్టినట్టే!కానీ నా వరకు 'మానవ సేవను మించిన మాధవసేవ లేదు'!
ఒక వ్యక్తి తను ఎంత కష్టపడ్డా చివరికి ఫలితం మరోలా ఉండొచ్చు. అందుకు ఆ ఫలితం గురించి ఆందోళన చెందుతాడు. అప్పుడు చేసే ప్రార్థన అతని ఆందోళనను కొంత వరకు నెమ్మదించేలా చేస్తుంది. ఉదా.నా మిత్రుడు పరీక్షల ముందు ఎంత కష్టపడ్డా నోటిలో ఎర్రపుళ్లు(స్ట్రెస్ అల్సర్స్) లేచేవి. అదే కొంత మంది దేవునికి దండం పెట్టుకొన్నాం అనే భావన కొంచెం ఎక్కువ విశ్వాసాన్నిస్తుంది.
మంచి చర్చను ప్రారంభించి ఈ విషయం మీద ఇంకొంచెం ఆసక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు. ఈ క్రింది లంకెలు నేను చెప్పిన వాటినే కాకుండా ధ్యానం/మంత్రజపం వల్ల మన శరీరంలో కలిగే మార్పుల గురించి,క్యాన్సర్ లో మన రోగనిరోధకశక్తిని ఎక్కువ చేసే పద్ధతుల గురించి, విద్యార్థుల్లో మానసికాందోళన వల్ల రోగనిరోధకశక్తిలో కలిగే మార్పుల గురించి ప్రస్తావించారు.
1.http://www.bmj.com/cgi/content/full/323/7327/1446
2.http://www.psychosomaticmedicine.org/cgi/content/full/65/4/571
3.http://www.ncbi.nlm.nih.gov/entrez/query.fcgi?cmd=retrieve&db=pubmed&list_uids=11576463&dopt=Abstract
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.