గత ఆరు వారాల్లో ఐదుసార్లు వెళ్లాను దేవళానికి. ఇప్పుడు మనం కలసిమెలసి తిరగడానికి దొరికిన సావాసగాళ్లు భక్తులయిరి. దేవళాలకు పోకూడదని నియమమేదీ లేదుగానీ, గత ఆరు వారాలు మినహాయిస్తే అంతకు ముందు ఐదేళ్లలోనూ మొత్తం కలిపితే ఐదుసార్లకు మించి దేవళానికి వెళ్లివుండనేమో. గుళ్లో ఆహ్లాదకరంగా గాలి వీస్తూ వుంటుంది. జనం ఎక్కువగా వుండరు. ఆ మెట్ల మీద కూర్చుని వుంటే హాయిగా వుంటుంది. దేవుళ్లవిగ్రహాల ముందు నిలబడే సమయం కంటే ఆ ఆవరణంలో మెట్లమీదే నేను ఎక్కువ సమయం గడిపాను. ఈ ఐదుసార్లలో రెండోసారి దేవళానికి పోయినప్పుడు చిన్న తమాషా జరిగింది. వెళ్లగానే కాళ్లూచేతులూ కడుక్కొని, ముందుగా వినాయకుని విగ్రహం ముందు నిముషం పాటు నిలబడి చేతులు కట్టుకుని కండ్లు మూసుకున్నాను. ఒక గంటసేపు మంచి నిద్రపట్టినప్పుడు కలిగే హాయి కలిగింది. మళ్లీ రెండుసార్లు వెళ్లినప్పుడు అక్కడే నిలబడితే అలాగే అనిపిస్తుందేమోనని చూశాను. అనిపించలేదు. ఐదోసారి జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నేనసలు దేవుళ్లవిగ్రహాలజోలికే పోలేదు. పాలరాతి రాధాకృష్ణులకు పక్కగా ఒకమూల మెట్లమీదే కూర్చుండిపోయాను మావాళ్ల దర్శనాలు, దండాలు, దక్షిణలు, ప్రదక్షిణలు పూర్తయిందాక. విగ్రహాలకు ఇనుపకడ...