'తెలుగుతో పాటు ఇంగ్లీషు చందమామ కూడా చదవండ్రా, మీ ఇంగ్లీషు మెరుగవుతుంద'ని ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె) లో మా ఆంగ్ల గురువు చెప్పారు - సెలవులకు ముందు. ఆమె సలహాను మరిచిపోకుండా రాజంపేటలో బస్సు మారేముందు చందమామలు కొన్నాను. తెలుగు చందమామను బస్సులో చదివితే వాళ్లూవీళ్లూ అడుగుతారని సంచిలో దాచిపెట్టి, ఇంగ్లీషు చందమామను హస్తభూషణంగా అలంకరించుకొని, రాయచోటి బస్సులో కూర్చున్నాను - దానిజోలికీ దాన్నిచదివే నా జోలికీ ఎవరూ రారని. ఆ ఇంగ్లీషులో కథ చదవడం చాలా కష్టంగా వుంది. బొమ్మలన్నా ఒకసారి చూద్దామని పేజీలు తిప్పుతూ, ఒక బొమ్మను చూసి ఆగిపోయాను. ఆ బొమ్మ వెనుక కమామీషు ఏమిటో కనుక్కుందామనే బలమైన కుతూహలం కలిగింది. ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద రాతిని దొర్లించాలని శ్రమపడుతుంటాడు, ఆ రాయి కదలదు. ఇదంతా ఆ పిల్లవాని తండ్రి చూస్తూవుంటాడు. ఇదీ ఆ బొమ్మ. దాని పక్కన నాలుగే నాలుగు ఇంగ్లీషు ముక్కలున్నాయి. "నిజంగా నువ్వు నీ బలాన్నంతా ఉపయోగిస్తే, ఆ రాయి కదులుతుంది" "నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను" "లేదే! నీ పక్కనున్న మనిషి సాయాన్ని నువ్వు అడగనేలేదే! సమయం వృధా చేస్తున్నావు."