ఆవొ సునావూఁ
ఇక్కడి నా సహోద్యోగుల్లో చాలా మందికి సంగీతంపై ఆసక్తి వుంది. మాలో కొందరు ఒక మోస్తరుగా పాడగలరు. కొందరేమో ఏదైనా ఒక వాయిద్యాన్ని బాగా సాధన చెయ్యాలనుకొంటూ వుంటారు. (!) మాకొక హైహై నాయకుడున్నాడు. ఈ నాయకుడు ఎంతో శ్రమకోర్చి, మాకు మంచి తిండి కూడా పెట్టి, మేమనే మాటలు పడుతూ, అప్పుడప్పుడూ మాపై తిరగబడుతూ మొత్తానికి మాలో ఒక ఆరేడుమందిని ఒక తాటిపై నిలబెట్టగలిగినాడు. ఇప్పుడు మేమంతా ప్రతి సోమవారం సాయంత్రం రెండు గంటలపాట మా ఇంట్లో సమావేశమై, గొంతులు చించుకొంటూ, గిటార్ల తీగలు తెంచుతూ, కీబోర్డులు, డ్రమ్ములూ పగలగొడుతూ నానా రభస చేసి ఆనందంగా విడిపోతాం. ఇలా చేబుతున్నానుగానీ, మా జట్టులో క్రమశిక్షణ కొంచెం ఫరవాలేదు. గ్రహాలన్నీ అనుకూలించిన ఒకానొక శుభముహూర్తాన గోవిందా నటించిన ఒక హిందీ సినిమా పాటను మేము తిరగ్గొట్టి కలిపాం. అనగా రీమిక్సు చేశామన్నమాట. మాదగ్గర సరయిన రికార్డింగు పరిజ్ఞానమూ పరికరాలూ లేకపోబట్టిగానీ ... ఈ ఘటనలో ఒక ప్రధానగాయకుడు, ఇద్దరు సహాయగాయకులు, ఒక సహాయగాయని, ఒక గిటారివాడు, ఒక డ్రమ్మరి పనివాడూ, ఇద్దరు కీబోర్డు ప్రెసిడెంట్లు పాపం/పాలు పంచుకున్నారు. నేను కీబోర్డు (రెండవది) వాయిస్తూ, అక్కడక్కడా కాస్త గొంతు చేస...