పోస్ట్‌లు

జులై, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

ఈ పాట గురించి గత అక్టోబరులో చిన్న చర్చ జరిగింది. అప్పట్లో ఆ వీడియో చూసి సంతోషపడి నాకొక వేగు (e-mail) పంపారు పరుచూరి శ్రీనివాస్ గారు. ఆ తరువాతి సంభాషణల సందర్భంగా కొన్నాళ్లకు ఈ పాట సాహిత్యాన్నీ, అటుపైన కొన్నాళ్లకు వోలేటి గారు స్వయంగా పాడిన రికార్డును పంపించారు. ఆ పాటను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో వుండేలా చెయ్యడానికి నాకీరోజు తీరింది. శ్రీనివాస్ గారికి అనేక కృతజ్ఞతలతో, మీకు సమర్పిస్తున్నాం __ :) గడచేనటే సఖీ ఈ రాతిరీ కడు భారమైన ఎడబాటునా ఈ మేఘవేళ ఏమో కదే చెలియ స్వామి దవ్వైనా నిదుర రాదాయెనే ఈ కడిమి వోలె ఎదురు చూచేనే సఖియా ఏకాకి నా బ్రతుకు చేదాయెనే రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం,సంగీతం: వోలేటి వెంకటేశ్వర్లు

చినచేపను పెదచేప

వెచ్చని నీటిలో చెచ్చెరలాడుతూ చేప పిల్లలు ఒంటి కాలిపై నిలబడి జపం చేసుకుంటూ ఓ తెల్లని కొంగ ముక్కును నీటిలో ముంచి కన్నీరు కారుస్తూ ఓ నీరాటం ఉక్కపోతగా ఓ ఉదయం సాగర తీరానికి సమీపంలో తదేకమై ఓ తటాకం ప్రియ సమాగమ మహాసంరంభాన విహ్వల నదీకన్యక విసిరేసిన తామస మా తటాకం మొసలి నీట మునిగింది కొంగ చెంగున లేచింది చేపల చెర్లాట చెదిరింది నిర్గుణ వాహిని విడిచిన జీవ చైతన్యపు నిరాలంబ తాపసిగా అదే తటాకం

... చినమాయను పెనుమాయ ...

మా ఇంటికి ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో పక్షుల అరుపులు వినబడుతూ వుంటాయి. పిట్ట యెంతదైనా కూత మాత్రం ఫోన్లో ఘనంగా వినబడుతూ వుంటుంది. మామిడి చెట్ల మింద వాలే చిలకలు, కోకిలలు, పుల్లాచెదలు, గోరింకలు, కాకులు, చిన్నచిన్న గువ్వల శబ్దాలు ఎంత బలంగా వినిపిస్తుంటాయంటే ఒకోసారి 'యినబళ్ల్యా!' అనాల్సుంటుంది. పదోతరగతి దాకా ప ల్లె ల లోనే చదువుకోవడంతో చెట్లు, పుట్టలు, పిట్టలు మనకు కొత్త కాదుగానీ ఆ తరువాత దూరం పెరిగిపోయింది. ఇదిగో ఈ కిందున్న వీడియోలో కనిపించే నలభై ఎకరాల చెఱువు చుట్టూ కూడా రెండు బారల పొద్దెక్కే దాకా రకరకాల పక్షుల శబ్దాలు వినపడుతూ వుంటాయ్. వీలు కుదిరినప్పుడల్లా పొద్దున్నే బయల్దేరి నూరు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ చెఱువును చేరి చుట్టూ ఒక సారి నడవడం నాకొక అలవాటుగా తయారవుతూ వుంది. ఇది ఆరోసారి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ వారాంతంలో వెళ్లిపోదామనిపిస్తుంది. పెద్దగా జన సంచారం వుండకపోవడం ఒక కారణం. ఉదయమే అక్కడకి చేరుకుంటే పక్షులు, నీటి జీవాలు చేసే శబ్దాలతో భలే సందడిగా వుంటుందీ ప్రాంతం. స్థూలంగా చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. గమనించే కొద్దీ చిన్నచిన్న విషయాలే విశేషాలుగా కనిపిస్తుంటాయి. ఇం...