అనగనగా ఒక అడవి. అడవి మధ్యలో ఒక గూడెం. కష్టంచేసుకుంటూ కాలం సాగించే ఆ గూడెంలో అందరికీ పాటలంటే ఇష్టం. గతించిన కాలంలో తమ తాతముత్తాతలు ఎంత బాగా పాడేవారో గుర్తుకొచ్చినప్పుడు, వారి జీవితాలలో ఒక భాగమైపోయి వుండిన పాట తమ తరంలో క్రమంగా దూరమైపోవడం గురించిన ఒక విచారం ఆ గూడెంలో పొడచూపేది. వారిలో కొందరికి పాడటమంటే మోజు. కొందరికి ఆ మోజును చూస్తే ముచ్చట. కొందరికి కొన్ని గొంతుల నుండి వినవచ్చేపాటంటే ఇష్టం, కొందరికి పాడేవారంటే ఇష్టం. వాళ్లలో కొందరు యువకులకు పాటలమీద మంచి పట్టు వుందని ప్రశంసలు. వాటిని అందుకొన్నవారిలో సింగడొకడు. మొదట్లో సింగనికి ఈ ప్రశంసలందుకోవడం కొంత భయపెట్టేది. ముందుముందు తాను వాళ్ల ప్రశంసలకోసమే పాడాల్సొస్తుందేమో అని. కానీ ప్రశంసలు భయంకన్నా చాలా ఎక్కువగా సంతోషపెట్టేవి. సింగర్ సింగడు, సింగారి సింగడు ఇలా రకరకాలుగా కొన్ని ఇతర గూడేలవారుకూడా అనేటప్పటికి... సింగని మనుసులో ఒక సంశయం. తనకోసమే పాడుకుంటూ వున్నాననుకునే వాడు మొన్నటిదాకా. బాగుందనేవాళ్లు బాగానే పెరిగారు మెల్లమెల్లగా. కొంత కాలానికి, "ఏమిటి నువ్వీమధ్య పాడటంలేదూ?" అని అడిగేవాళ్లు కూడా వచ్చారు. అలా సింగడ...