ఆ తరువాత నేను Little Prince వైపు కన్నెత్తికూడా చూడలేదు. తల పక్కకు తిప్పడానికి కూడా వీల్లేనంతగా ఆఫీసులో పని పెరిగిపోయింది. నిజానికి ఇప్పుడు కూడా నేను పనిలో ఉండాలి. మరీ ఆటవిడుపు లేకపోతే పనిమీద కూడా మనసు నిలవదనే సాకుతో నాకు నేనే నచ్చజెప్పుకుని ఈ టపా రాస్తున్నాను. సాయంత్రానికి మెదడు అలసిపోతోంది. రోజులు క్షణాల్లాగడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినే నేనిన్నాళ్లూ కోరుకున్నది. బాగుంది కానీ, కూడలిలో తెగతిరిగే నాకు ఇప్పుడు కాళ్లు కట్టేసినట్లుంది. ఇంకొక ముఖ్యమైన రాతపని కూడా ఉంది. అదీ ముందుకు కదలడం లేదు. సాయంత్రం కొంతసేపు "ప్రథమావిభక్తిరహిత సుగ్రీవాగ్రజసుతక్రీడ" ఆడుకోవడమూ అలసిపోయి మాంచి నిద్రలోకి వెళ్లిపోవడమూ. వంటచేసే ఓపిక అసలుండదుకనుక "కలిగినదేదో కనులకద్దుకొని కాలము గడిపే" ధన్యజీవనము చేస్తున్నాను. తలమునకలుగా పని, అలసిపోయేదాక ఆట, ఆదమరపుగా నిద్ర - ఇంతకన్నా ధన్యజీవనం ఇంకేమున్నది! ఇంతకూ ఈ టపా పేరులోని నవ్వ అంటే ఏమిటో తెలుసా!?