ఒక ట్రావెలాగుడు - మొదటి టపా
అంత వరకూ "ఎడారి" అనే పదం వినబడగానే యేండ్ల తరబడి వానల్లేక ఎండిపోయిన ఇసుక పర్ర కనుచూపు మేర పరచుకొని వున్న దృశ్యం మనసులోకి వచ్చేది. ఇంటర్మీడియట్‌లో వుండగా రంగీలా సినిమా వచ్చింది. మా బ్యాచ్ మొత్తం ఒక ఆదివారం టౌన్లోకి వెళ్లాం. పోస్టర్లు, కటౌట్లు చూశాం. అది తెలుగు సినిమా కాదని తెలిసింది. అప్పుడు నాకు హిందీ రాదు. ఇప్పుడొచ్చునా అనేది అప్రస్తుతం. ఆ చిత్ర దర్శకుడు తెలుగువాడని తెలిసింది. "కళారాధనకు భాష ఒక అడ్డుగోడ కాకూడదని" అక్కడికక్కడే పోస్టర్ల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం జరిగిపోయింది. మాలో చానామందికి హిందీ రాకపోయినా సరే థియేటరుకు వెళ్లి చూశాం. ఎక్కడున్నాం? ఆఁ... ఎడారి. ఎడారి అనగానే "తేరీ.... ఎయ్ సీ అదా పే... తో ఫిదా హమ్ హై ..." పాటలో చూసిన ప్రాంతాలు మనసులోకి వచ్చేవి (మెలకువలో మాత్రమే కాదు). ఇంటర్మీడియట్‌లో వుండగానే బోటనీ అనబడు వృక్షశాస్త్రములో ఎడారి మొక్కల గురించి చదువుకొన్నాం. వీటిలో సైకస్ చెట్టు ఒకటి. కానీ అక్కడ చదివినవాటిలో నాగజెముడు , బ్రహ్మజెముడు , తంగేడు , తుమ్మ , ఈత, తాటి ఇట్లా చాలా వరకూ చెట్లను వీరబల్లె చుట్టుపక్కలలోనే చూసివుండటం చేత "పాపం ఎడారి మొక్క