టింగురంగని సందేహాలు
ముల్లు : " ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు - ఎక్కడో గుచ్చావు చాపముల్లు " అన్ని వర్గాలనూ కదిలించిన పాట. "సుప్రీం హీరో మఱియు మెగాస్టార్ అయిన మిమ్మల్ని... నిన్నగాకమొన్న చిత్రసీమలో అడుగుపెట్టిన నగ్మా 'బే' అనడమేమిటి? ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేకున్నాను." అని ఒక అభిమాని తన రక్తంతో లిఖించి చిరంజీవికి పంపించాడని 'ఇండియా టుడే'లో చదివాను ఆ కాలంలో. "ఏం పాటలో ఏం ఖర్మో, రాబోయే కాలంలో ఇంకా ఏమేం వినాల్సొస్తుందో!" -- మరో వర్గం "ఏం పాట!! నా సామిరంగా... ఏమి స్టెప్పులూ...!!!" -- ఇంకో వర్గం నాకు మాత్రం ఇవేవీ పెద్దగా పట్టలేదు. ఈ పాటలో 'స్‌సోడాకొట్టు అలా అలా విస్కీకొట్టు ఇలా ఇలా' అనేటప్పుడు బాలు గొంతు తాగిన చిరంజీవి గొంతుమాదిరే వుంటుందికదా అనుకుంటే, చిత్ర కూడా తాగినట్టు పాడటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పుడు మనం ఏడో తరగతి - ఎనిమిదో తరగతి ఆ మధ్యలో ఉన్నాం. సినిమాలు అందనంత దూరంలో ఉండేవి. పాటలు మాత్రం ఊర్లో వినబడుతూ ఉండేవి. కొన్నాళ్లకు రేడియోలో కూడా వచ్చాయి. చాపముల్లేమిటి చాపముల్లు? చేపముల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. చేపముల్లయితే ఎవరో గుచ...